- వివిధ సమస్యలపై కలెక్టరేట్ఎదుట ధర్నాలు
నస్పూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీసు ధర్నాలతో దద్దరిల్లింది. సోమవారం జరిగిన గ్రీవెన్స్ తో పాటు వివిధ సమస్యలపై ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందించారు. టీఎస్ సీఎస్సీని రద్దు చేసి మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతూ డీఎస్సీ అభ్యర్థులు మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13 వేల డీఎస్సీ పోస్టులు విడుదల చేయాలని, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీని రద్దు చేయాలన్నారు.
టెట్ఫలితాలు విడుదల చేయకుండా డీఎస్సీ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఆదర్శ పాఠశాల టీచర్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. 12 నెలల వేతనం, ఆటో రెన్యువల్ విధానం అమలు, మినిమమ్ టైం స్కేల్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ కాంట్రాక్ట్ టీచర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు.
మా భవనం మాకే ఇవ్వాలి..
గతంలో సాంఘిక సంక్షేమ మహిళ వసతి గృహం కోసం నిర్మించిన భవనాన్ని తమకే ఇవ్వాలని ప్రభుత్వ డిగ్రీ, జూనియర కళాశా విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ కోసం నిర్మించిన బిల్డింగ్‌ను న్యాయస్థానం కోసం ఇస్తే ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని వెంటనే జిల్లా వ్యాప్తంగాహెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ప్రతి ఇంట్లో విష జ్వరాల బారినపడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆదివాసులకు ఇచ్చిన పోడు పట్టాలకు పంట ఋణం ఇప్పించాలని తాండుర్ మండలం నర్సాపూర్ గ్రామ ప్రజలు కోరారు.