భద్రాచలం, వెలుగు : ఐదు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు గురువారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాచారి మాట్లాడుతూ కొత్త కాంట్రాక్టరు వచ్చిన నాటి నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్మికుల ఆకలిబాధలు ఆఫీసర్లకు పట్టడం లేదని వాపోయారు.
గత ఫిబ్రవరి నెలలో ఆందోళన చేస్తే ఐటీడీఏ ద్వారా ఇప్పిస్తామని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ హామీ ఇచ్చారని, కానీ నేటికీ హామీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. ఆర్ఎంవో డాక్టర్ రాజశేఖర్ వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు.
ఈనెల 9 నాటికి కార్మికుల అకౌంట్లో వేతనాలు వేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాలో సీపీఎం టౌన్సెక్రటరీ గడ్డం స్వామి, నాయకులు బండారు శరత్‌బాబు, వైవీ రామారావు, పి.సంతోష్‌కుమార్, నాగరాజు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.