వేములవాడ, వెలుగు: ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ వేములవాడ పర్యటన సందర్భంగా 1200 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పట్టణంలోని మహారాజ గార్డెన్ లో అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ 10 సెక్టార్లుగా విభజించి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. బందోబస్త్ కి వచ్చిన పోలీసులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను పూర్తి అప్రమత్తతతో నిర్వర్తించాలన్నారు. డ్యూటీ ఏరియా నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని, ఏదైనా సందేహం ఉంటే ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, చంద్రశేఖర్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న వేములవాడకు రానున్నారు. రాజన్న దర్శించుకున్న తర్వాత నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ లీడర్లు తెలిపారు. 8న ఉదయం 8.45 గంటలకు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా పట్టణ శివారులోని బాల్ నగర్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం 8:30 నుంచి10 గంటల ప్రధాని పర్యటన కొనసాగనుంది. సుమారు లక్షమందితో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు.