ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • వడ్లు, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆఫీసర్లకు ఆదేశం

భైంసా, వెలుగు : ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్​ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్అండ్ బీ గెస్ట్​హౌస్​లో కలెక్టర్  అభిలాష అభినవ్, అడిషలన్​ కలెక్టర్  కిశోర్ కుమార్, రెవెన్యూ, ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి సంరక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సర్వే నిర్వహించి వివరాలను అందించాలని ఆదేశించారు. వడ్లు, పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పంపిణీ చేసిన డబుల్​ బెడ్​రూం ఇండ్లు, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బైంసా పట్టణం సమీపంలోని డబుల్  బెడ్రూమ్  ఇండ్లను మంత్రి పరిశీలించారు. నిర్మల్, బైంసా ఆర్డీవోలు రత్న కల్యాణి, కోమల్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, డీఎస్ వో కిరణ్ కుమార్  పాల్గొన్నారు.

గత ప్రభుత్వం  ధరణితో రైతులను భయపెట్టింది..

గత సర్కారు ధరణి పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. భైంసా మండలంలోని మాటేగాంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు పదేండ్లుగా ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, ధరణి పేరుతో రైతులను భయపెట్టి భూములున్న ఆసాములకే మరిన్ని ఎకరాలు కట్టబెట్టారని విమర్శించారు.

 ప్రతి కుటుంబానికి స్మార్ట్  కార్డు అందజేస్తామని, సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అక్కడి బంధువులు, కార్యకర్తలకు ఇక్కడి పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని వివరించాలని సూచించారు.  మాజీ ఎమ్మెల్యే విఠల్  రెడ్డి, భైంసా ఏఎంసీ చైర్మన్  ఆనందరావు పటేల్  పాల్గొన్నారు.