మనసు గట్టిగ ఉంటే చాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు. ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. కానీ ఈ మధ్య చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా... చిన్నపాటి సమస్య ఎదురైతే చాలు మానసికంగా బలహీన పడుతున్నారు. ‘ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?’ అనుకుంటున్నారు. ‘ఒంటరి’ వాళ్లం అయ్యామన్న ఫీలింగ్‌తో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే సమస్యల ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. మనసును డీలా పరుస్తున్న ‘చెడు’ మీద గెలవడం అంత కష్టమా అంటే.. కానే కాదు. ఇది కూడా చెడు మీద మంచి సాధించే ‘విజయం’ లాంటిదే.
సమస్యలు, ఒత్తిళ్లు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్లు... అనేవి ఈ మధ్య కాలంలో కొత్తగా పుట్టుకు రాలేదు. మనిషితో పాటు ఎప్పట్నించో ఉన్నవే. లైఫ్ జర్నీ అనేది గతుకులు లేని, స్పీడ్ బ్రేకర్స్ రాని రోడ్డు జర్నీ కాదు. ఎన్నో అడ్డంకులు, సమస్యలు ఉంటాయి. ఎదురవుతాయి. కాకపోతే వాటినుంచి ఎలా బయటపడ్డారనేది ఇంపార్టెంట్. నిజానికి ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా వాటిని డీల్ చేస్తుంటారు. వాస్తవానికి సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు చుట్టూ ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాగే సాయం చేసే చేతులు, మనుషులు, సంస్థలు కూడా ఉన్నాయి.
అదో అవకాశం...
నిజానికి ‘బాధ’ కలిగినపుడు దాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా చూడండి. అలా అనుకోవడంతోనే సమస్య మీద విజయం సాధించడం మొదలైపోతుంది. బాధ నుంచి నేర్చుకునేది చాలానే ఉంటుంది. అలాకాకుండా కష్టం ఎదురైందని నిరాశనిస్పృహల్లోకి వెళ్లిపోతే.... ఎంతో విలువైన కాలం చేజారిపోతుంది. చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఒక సమస్య ఎదురైందంటే... దాని వెనకే పరిష్కారం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ సమస్యనుంచి బయటపడేసే టూల్ కూడా అందులోనే ఉంటుంది.
కష్టాలనేవి శత్రువులు కాదు. అవి మనిషి లోపలి బలాన్ని, ధైర్యాన్ని, సమయ స్ఫూర్తిని బయటకు తీసే ఫ్రెండ్స్ అవి. ఇలా చెప్పడం తేలికే.. ప్రాక్టికల్‌గా సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్లకి తెలుస్తుంది ఆ బాధ, దాని తాలూకా ఒత్తిడి. ఒక మనిషి ఎన్ని సమస్యలను తట్టుకోగలరు? ఒకదానివెంట ఒకటి, ఒకదాని తరువాత ఒకటి వచ్చి మీద పడుతుంటే. ‘నువ్వు ఇలా చెయ్యి. అలా ఉండు’ అని ఒడ్డున నిల్చొని చెప్పడం తేలిక. సమస్యల్లో పడి కొట్టుకుపోతున్న వాళ్లకి కదా అసలు బాధ తెలిసేది అంటున్నారా? అది నిజమే. సమస్యలు ఎదురైనప్పుడు ఏం తోచనీయకుండా మనసు, మెదడు మీద ఆలోచనల మూకుమ్మడి దాడి జరుగుతుంది.
సరిగ్గా ఇలాంటప్పుడే ఒక బంతిని బలంగా నేల మీదకి విసిరి కొడితే... అది ఇంకింత శక్తితో పైకి ఎలాగైతే ఎగురుతుందో... అలా సమస్యల నుంచి బయటపడేలా ఆలోచించాలి. సముద్రంలో అలలు కూడా అంతే కదా! అవి ఎంతో ఎత్తుకి ఎగిరి కిందపడతాయి. మళ్లీ అంతకంటే ఎత్తుకు లేచే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇందులో బంతి లేదా అల కింద పడటం వరకే చూస్తే నిరాశే మిగులుతుంది. అలాకాకుండా అవి కిందపడ్డాక ఎగిరిన ఎత్తు చూస్తే ఆ ఎగరడంలోని బలం కనిపిస్తుంది.
బుర్ర ఎంత గట్టిదో తెలుసా!
సంతోషం, బాధ, దుఃఖం ఇవన్నీ బుర్రలోనే ఉంటాయి. నిజానికి హ్యాపీ, అన్‌హ్యాపీ అనేవి మన చేతుల్లోనే ఉంటాయి. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే చేతులారా ఎవర్ని వాళ్లే బాధపెట్టుకుంటారు కాబట్టి. కానీ, ఆ బాధకు కారణం మాత్రం బయటి అంశాలే అని వాటి వైపు వేలెత్తి చూపిస్తుంటారు. అది వ్యక్తులు లేదా పరిస్థితులు... ఏవైనా కావచ్చు. బాధ, నిస్సహాయ స్థితికి కారణం బయటి పరిస్థితులనే అనుకుంటారు ఎక్కువమంది. కానీ, ఇదంతా పక్కనపెట్టి ఒక సమస్య ఎదురైనప్పుడు మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేదే చూసుకోవాలి. అంతేకానీ పక్క వాళ్లో, పరిస్థితులో మారాలి అని చూడకూడదు. మైండ్‌ను మార్చాలి. అందుకే ‘మనసును జయించడం తెలిస్తే ప్రపంచాన్ని జయించడం ఈజీ’ అంటారు మానసిక నిపుణులు. మరి అలాంటి గట్టి బ్రెయిన్‌ని అనవసరపు ఆలోచనలతో, నిస్సహాయ భావాలతో నింపేయడం ఎవరు చేస్తున్న తప్పు?
అందరికీ ఉంటుంది
ఒత్తిడి అనేది అందరికీ ఉంటుంది. అది పిల్లల్ని డిసిప్లీన్గా ఉంచేటప్పుడు, వర్క్‌లో బిజీగా ఉన్నప్పుడు, ఆర్ధిక విషయాలు మేనేజ్ చేస్తున్నప్పుడు లేదా రిలేషన్షిప్లో ఛాలెంజ్‌లు ఎదురైనప్పుడు.... ఇలా ఏదో ఒక దశలో ఒత్తిడి ఉంటుంది. నిజానికి కొంత ఒత్తిడి ఉండడం అనేది అవసరం. ఓ మాదిరి ఒత్తిడి వల్ల లాభమే! అయినప్పటికీ అది మోతాదు మించి ఉంటే మానసిక, శారీరక అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఒత్తిడి బారిన పడి తిప్పలు పడకుండా ఉండాలంటే అసలు అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. అయితే జ్వరం, దగ్గు వంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌ని గుర్తుపట్టినట్టు ఒత్తిడిని గుర్తించడం కష్టమే. చాలామందికి.. చాలాసార్లు ఒత్తిడి బారిన పడ్డామనే విషయమే తెలియదు. ఆ ఒత్తిడి మానసికంగా దాడిచేసి శారీరక ఇబ్బంది ద్వారా బయటపడినప్పుడే గుర్తించగలుగుతారు.
ఒత్తిడిని సింపుల్‌గా వివరించాలి అంటే... హాని కలిగించే పరిస్థితులకు శరీరం రియాక్ట్ కావడం అన్నమాట. వాస్తవానికి శరీరం కొంత మోతాదులో ఒత్తిడిని తట్టుకునేలా ఉంటుంది. కానీ ఆ ఒత్తిడి ఎక్కువ కాలం ఉంటే మాత్రం శరీరంలో ఆ శక్తి పోతుంది. ఒత్తిడి లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయి. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఏవైనా మీకు ఉంటే డాక్టర్ని కలిసి మాట్లాడాలి.
భావోద్వేగాల్లో...
- ఎమోషన్స్‌లో తేడా. చిన్న విషయానికి కూడా త్వరగా కోపం రావడం. చిరాకు తెచ్చుకోవడం. మూడీగా ఉండడం.
- పరిస్థితులు చేతుల్లో లేకుండా పోతున్నాయనో లేదా మీ చేతుల్లోకి పరిస్థితులను తెచ్చుకోవాలనో అనుకోవడం.
- మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకోలేకపోవడం.
- ఆత్మస్థైర్యం తగ్గిపోవడం. ఆత్మన్యూనత. ఒంటరి అనే భావన. ఈ ప్రపంచంలో నాకు విలువలేదు అనిపించడం. డిప్రెషన్.
- నలుగురితో కలవకుండా ఉండడం.
శారీరక లక్షణాలు.
శక్తి తక్కువగా ఉండడం. తలనొప్పి, డయేరియా, మలబద్ధకం, వికారం. ఒళ్లు నొప్పులు, తీపులు, టెన్షన్, ఛాతి నొప్పి, గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉండడం, నిద్రలేమి, ఎక్కువసార్లు జలుబు రావడం, ఇన్ఫెక్షన్స్ బారిన పడడం, లైంగికాసక్తి లేకపోవడం, లైంగిక సామర్ధ్యం తగ్గడం, నెర్వస్నెస్, వణుకు, చెవుల్లో శబ్దాలు వినపడడం, చేతుల్లో, పాదాల్లో చలి లేదా చెమట పట్టడం, నోరు పొడిబారటం, మింగడానికి ఇబ్బంది పడడం. దవడలు బిగపట్టడం, పళ్లు నూరడం.
కాగ్నిటివ్ సింప్టమ్స్: ఎప్పుడూ ఆందోళన చెందడం, ఆలోచనలు స్థిరంగా లేకపోవడం, మతిమరుపు, ఆర్గనైడ్గా లేకపోవడం, ఏకాగ్రత లోపం, జడ్జిమెంట్ సరిగా చేయలేకపోవడం, ప్రతీ విషయాన్ని నెగెటివ్‌గా చూడటం.
ప్రవర్తనలో లోపాలు: అతిగా తినడం లేదా అసలు తినకుండా ఉండడం. బాధ్యతలు వదిలేయడం. ఆల్కహాల్ లేదా సిగరెట్లు ఎక్కువగా తీసుకోవడం. గోళ్లు కొరకడం, చేతులు కాళ్లు అదేపనిగా ఊపుతుండడం.
ఎక్కువకాలం ఒత్తిడి ఉంటే...
ఒత్తిడి ఎక్కువ కాలం ఉండి, దానివల్ల సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే జాగ్రత్తపడాలి. మానసిక ఆరోగ్య సమస్యలు... అంటే డిప్రెషన్, ఆందోళన, పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటే డాక్టర్ని కలవాలి. కార్డియోవాస్క్యులార్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అసాధారణంగా గుండె కొట్టుకోవడం, హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్, ఒబెసిటీ, ఈటింగ్ డిజార్డర్స్, మెనుస్ట్రువల్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ డిస్ఫంక్షన్, ఇంపొటెన్స్, మగవాళ్లలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఆడవాళ్లలో లైంగికాసక్తి కోల్పోవడం వంటివి ఉన్నప్పుడు డాక్టర్లని కలిసి మాట్లాడాలి. అలాగే స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్, యాక్నె, సోరియాసిస్, ఎగ్జిమా, పర్మనెంట్ హెయిర్ లాస్, గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిటైటిస్, అల్సరేటివ్ కొలిటిస్, ఇరిటబుల్ కోలన్ సమస్యలు ఉన్నా కూడా వెంటనే జాగ్రత్తపడాలి.
సాయం ఉంది
జీవితంలో ఒత్తిడి అనేది ఒక భాగం. అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఒత్తిడికి సంబంధించిన లక్షణాలను గుర్తించగలిగితే అది ఆరోగ్యం మీద దాడి చేయకుండా జాగ్రత్తపడొచ్చు. చాలావరకు ఒత్తిడికి సంబంధించిన లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఒత్తిడి వల్లే వస్తుంటే కనుక థెరపిస్ట్, కౌన్సెలర్ సాయం చేస్తే దాన్నుంచి బయటపడొచ్చు.
బోలెడు పద్ధతులు...
- ఒత్తిడి అనేది మనిషి జీవితంలో చాలా సహజమైన విషయం. ఆ ఒత్తిడే లేకపోతే ఏ మోటివేషన్ లేకుండా ఓ పనికిరాని వస్తువులా మనుషులు పడి ఉంటారనడం అతిశయోక్తి కాదు. ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకపోవడం, ఉద్యోగం పోవడం, కుటుంబ సభ్యుల మరణం లేదా మనసుకు బాధ కలిగించే ఏదో ఒక సంఘటన జరగడం వల్ల మానసికంగా బలహీనం కావడం, ఆందోళన వంటివి ఉంటాయి. అయితే ఇదంతా చాలా సాధారణమైన విషయంగా చూడాలి. అయితే ఈ పరిస్థితి కొన్ని వారాల పాటు ఉన్నా లేదా ఇంటి, ఆఫీసు పనులకు అడ్డుపడుతున్నా దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
- సాధ్యమైనంత త్వరగా మానసిక నిపుణుల్ని కలవాలి. మనసు విప్పి మాట్లాడాలి. ఒకవేళ వెంటనే మానసిక నిపుణుల దగ్గరకు వెళ్లడం ఇష్టంలేకపోతే మనసుకు దగ్గరి, నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడాలి. ఒత్తిడినుంచి బయటపడేసేందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిని ట్రై చేయొచ్చు. వీటి గురించి చదువుతుంటే చాలా సింపుల్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ ఇవి కొంతమేర ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
- బాగా యాంగ్జైటీగా ఉన్నప్పుడు చూయింగ్ గమ్ నోట్లో వేసుకుని నమలాలి. ఇలాచేస్తే ఒత్తిడి తగ్గుతుందని ఈ మధ్యనే ఒక స్టడీ వెల్లడిచేసింది. ఒత్తిడికి, చూయింగ్ గమ్‌కి సంబంధం ఏమిటంటే... చూయింగ్ గమ్ తినడం అనేది ఒక రిథమిక్ యాక్టివిటీ. దానివల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుందని కొందరు రీసెర్చర్లు చెప్తున్నారు. మరికొందరేమో చూయింగ్ గమ్ వాసన, రుచి మైండ్‌ని రిలాక్స్ చేస్తున్నాయని చెప్పారు. ఏదేమైతేనేం ఫలితం అయితే ఉంటుంది. అది చాలు కదా!
- చిరాకుగా అనిపిస్తున్నప్పుడు కాసేపు బయటకు వెళ్లి నడవాలి. అలా కొన్ని నిమిషాలు చేస్తే చాలా బెటర్‌గా ఫీలవుతారు.
- టెన్షన్‌గా అనిపించినప్పుడు ముఖం మీదకి చిరునవ్వు తెచ్చుకోవాలి. అలాగని అది బలవంతపు నవ్వు కాకూడదు. ఈ నవ్వు శరీరంపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి వల్ల పెరిగిన గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది.
- కొన్ని రకాల వాసనలు కూడా ఒత్తిడి నుంచి బయటపడేస్తాయని ఒక స్టడీ తేల్చింది. ఆ స్టడీలో భాగంగా హాస్పిటల్స్‌లో పనిచేసే నర్స్‌ల డ్రెస్‌ల మీద లావెండర్ ఆయిల్ స్ర్పే చేశారు. దానివల్ల వాళ్లలో ఒత్తిడి తగ్గినట్టు వెల్లడైంది. లావెండర్ ఆయిల్‌ను కొన్ని పెయిన్ కిల్లర్స్, యాంటీ యాంగ్జయిటీ మెడికేషన్‌లో వాడతారు కూడా.
- ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు మ్యూజిక్ బాగా పనిచేస్తుంది. అందుకే ఒత్తిడితో ఉండే పనేదైనా చేయాల్సి వచ్చినప్పుడు మ్యూజిక్ వింటే ఒత్తిడిని కలిగించే హార్మోన్ కార్టిసోల్ విడుదల తగ్గుతుంది.
- శ్వాస మీద ధ్యాస పెడితే కూడా ఒత్తిడి ప్రభావం శరీరం మీద పడకుండా చేసుకోవచ్చు. ఫైట్ ఆర్ ఫ్లయిట్(పోరాడటం లేదా పారిపోవడం) అనే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. నెగెటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో సౌకర్యవంతంగా కూర్చొని ముక్కుతో నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చాలి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఛాతి, పొత్తికడుపు ముందుకు రావాలి. ఆ తరువాత నెమ్మదిగా శ్వాస బయటకు వదలాలి. ఇలా చేస్తున్నప్పుడు మీకు నచ్చిన ఒక పదం ఏదైనా అనుకుంటూ చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ తరువాత నెమ్మదిగా శ్వాసను బయటకు వదలాలి. అప్పుడు కూడా మీకు నచ్చిన పదం లేదా వాక్యాన్ని చెప్తూ రిలాక్స్ కావాలి. ఇలా కనీసం పది సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- బుర్రలో ఒకదానివెంట ఒకటి ఆలోచనలు ముసురుతూ తెగ చిరాకు తెప్పిస్తాయి కొన్నిసార్లు. ఆ పరిస్థితిలో మీతో మీరు మాట్లాడుకుని బుర్రని ఒక దారికి తెచ్చుకోవాలి. అప్పుడే బ్రెయిన్ పట్టు మీ చేతికి చిక్కుతుంది. అదెలా సాధ్యం అంటే... ఉదాహరణకి మీ ఫ్రెండ్ ఒకరు మీరు ఉన్నలాంటి పరిస్థితిలోనే ఉంటే... వాళ్లని ఎలాగైతే ఓదారుస్తారో అచ్చం అలానే మిమ్మల్ని మీరు ఓదార్చుకోవాలి.
- ఆలోచనలను పేపర్ మీద రాస్తే వాటి గురించి క్లారిటీ వస్తుంది. ఆ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది... ఆ ఫీలింగ్స్ పట్ల మీరు ఎంత నిజాయితీగా ఉన్నారని.
- బుర్రంతా ఆలోచనలతో నిండిపోయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ లేదా మీ మనసుకు దగ్గరి వాళ్లతో మాట్లాడాలి. ఇలాచేయడం వల్ల మంచి జరుగుతుంది. ఒకవేళ మీలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్న స్నేహితులు ఉంటే వాళ్లతో మనసు విప్పి మాట్లాడాలి. అప్పుడు ఇద్దరిలో ‘నేను ఒంటరి’ అనే ఫీలింగ్ ఉండదు.
- శారీరక శ్రమ చేస్తే మూడ్ సెట్ అవుతుంది. బుర్రలో గిరగిరా తిరిగే ఆలోచనలకు కూడా బ్రేక్ పడుతుంది. ఒత్తిడికి గురి చేస్తున్న విషయం ఏదైనా సరే దాన్నుంచి కాసేపు బ్రేక్ తీసుకుని లాంగ్ వాక్ లేదా జిమ్‌లో వర్కవుట్ చేయాలి. ఈ రెండిటిలో ఏది ఇష్టం అనిపిస్తే అది చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మూడ్ బాగుపడడం ఖాయం.
ఈ మార్పులు అవసరం
- పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండాలి.
- కొన్ని విషయాలు మీ అదుపులో ఉండవు అనే విషయాన్ని అంగీకరించాలి.
- మీ ఫీలింగ్స్, అభిప్రాయాలు లేదా నమ్మకాలు కోపావేశాలతో కాకుండా నిశ్చితంగా ఉండాలి.
- టైంను ఎఫెక్టివ్‌గా మేనేజ్ చేయడం నేర్చుకోవాలి.
- లిమిట్స్ పెట్టుకోవాలి. ఒత్తిడికి గురిచేసే అంశాలకు దూరంగా ఉండాలి. మీకు నచ్చని పని బలవంతంగా చేయాల్సి వస్తే ‘నో’ చెప్పాలి.
- అభిరుచులు, ఆసక్తులకోసం టైం పెట్టుకోవాలి.
- ఆల్కహాల్ లేదా డ్రగ్స్ వంటి అలవాట్లు చేసుకోవద్దు. డ్రగ్స్, ఆల్కహాల్ వల్ల ఇంకా ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది.
- సోషల్ సపోర్ట్ తీసుకోవాలి. మనసుకు నచ్చిన, ప్రేమించే వ్యక్తులతో ఎక్కువ టైం గడపాలి.
- అవసరమైతే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళ్లాలి.
లైఫ్ స్టయిల్లో...
ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇప్పటివరకు చెప్పుకున్నవే కాకుండా ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. వాటిలో లైఫ్‌స్టయిల్ మార్పులు కూడా చాలా ముఖ్యమైనవి. అవి...
వ్యాయామం : ఫిజికల్ యాక్టివిటీ అనేది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. మంచి నిద్రపోతే స్ట్రెస్ మేనేజ్మెంట్కూడా బాగా చేయొచ్చు. ఇందుకు కారణం ఇదీ అని చెప్పలేం. కానీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవాళ్లకు గాఢ నిద్ర పడుతుంది. దీనివల్ల బ్రెయిన్, బాడీ రెండిటికీ ఎనర్జీ వస్తుంది. అలాగని ఇంకాసేపట్లో నిద్రపోతాం అనేముందు ఎక్సర్సైజ్ చేయొద్దు. ఇలా చేయడంవల్ల నిద్ర పట్టడం సంగతి అటుంచితే వచ్చే కాస్త నిద్ర కూడా తేలిపోతుంది.
ఎక్సర్సైజ్ చేయడం వల్ల మూడ్ బాగు పడుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎండార్ఫిన్లు, ఎండోకానబినాయిడ్స్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తాయి.
ఈ సారి గమనించి చూడండి... ఎక్సర్సైజ్ చేసే వాళ్లలో ఆందోళన తక్కువగా ఉంటుంది. పాజిటివ్‌గా ఉంటారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మైండ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. రన్నింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్, సైక్లింగ్, ఎయిరోబిక్స్ వంటివి ఒత్తిడి నుంచి బయటపడేసే వ్యాయామాలు. ఒకవేళ వీటిని చేసే టైం లేకపోతే... షాపుకి వెళ్లేటప్పుడు బండి మీద కాకుండా సైకిల్ మీద వెళ్లాలి. లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కాలి. మీరు వెళ్లాల్సిన ప్లేస్‌కి దూరంగా పార్కింగ్ చేయాలి. కారు లేదా బండిని మీరే వాష్ చేసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. లంచ్ బ్రేక్‌లో కాసేపు నడవచ్చు.
డైట్: హెల్దీ ఫుడ్ తినడం వల్ల నడుము చుట్టుకొలత పెరగదు. మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. హెల్దీ డైట్ అనేది స్ట్రెస్‌ను బాగా తగ్గిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్, మూడ్‌ను బెటర్ చేస్తుంది. రక్త పోటు తగ్గిస్తుంది. ఫుడ్‌లో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఒత్తిడి ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటే ఆ ప్రభావం ఇంకా దారుణంగా తయారవుతుంది. హెల్దీగా ఉండాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, లీన్ ప్రొటీన్స్తో పాటు ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేప, మాంసం, గుడ్లు, నట్స్ తినాలి.
యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తింటే దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కణాలు నాశనం కాకుండా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ బీన్స్, పండ్లు, బెర్రీస్, కాయగూరలు, అల్లం వంటి మసాలా పదార్థాల్లో దొరుకుతాయి. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు హెల్దీ డైట్ తినొచ్చు. ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు హెల్దీ శ్నాక్స్ పట్టుకెళ్లాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఏం తింటున్నారనేది చూసుకుని తినాలి. బాడీ, మైండ్ మీద ఒత్తిడి ప్రభావం పడకుండా ఉండాలంటే విటమిన్– సి, మెగ్నీషియం, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తినాలి అంటున్నారు సైంటిస్ట్‌లు.
నిద్ర : ఒత్తిడి వల్ల నిద్ర మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. అయితే నిద్ర గురించి ఎప్పుడు సీరియస్‌గా ఆలోచించాలంటే... వరసగా మూడు నెలల టైంలో వారంలో మూడుసార్లు నిద్రపోలేకపోతుంటే ఇన్సోమ్నియా ఉన్నట్టే. నిద్రలేమి వల్ల స్ట్రెస్ లెవల్స్ పెరుగుతాయి. ఒత్తిడి, నిద్రలేమి రెండూ ఒక చక్రంలా తిరుగుతుంటాయి. మంచి నిద్ర పట్టడం అనేది రోజూవారీ దినచర్య, బెడ్రూమ్ ఎలా ఉందనే దానిమీద ఆధారపడి ఉంటుంది.
క్రమం తప్పకుండా చేసే ఎక్సర్సైజ్, ఎండకి ఎక్స్పోజ్ కావడం, నిద్రపోయే ముందు ఆల్కహాల్, కెఫిన్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. స్లీప్ షెడ్యూల్ మెయింటెయిన్ చేయాలి. నిద్రపోవాలనుకున్న అరగంట నుంచి గంటలోపు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి దూరంగా ఉండాలి. నిద్రపోయేముందు మెడిటేషన్ లేదా ఇతర రిలాక్సేషన్ టెక్నిక్స్ ట్రై చేయాలి. వీటన్నింటితో పాటు బెడ్రూమ్ వాతావరణంది కీ రోల్ అన్న విషయం మర్చిపోవద్దు. నిద్రపోయే గది డార్క్‌గా, ప్రశాంతంగా ఉండాలి.
రిలాక్సేషన్ టెక్నిక్స్...
యోగా కూడా ఎక్సర్సైజ్ లాంటిదే. యోగా చేస్తే మెడిటేషన్ కూడా చేసినట్టే. యోగాలో చాలా రకాలు ఉన్నాయి. నెమ్మదిగా చేసే మూమెంట్స్ నుంచి స్ట్రెచింగ్, డీప్ బ్రీతింగ్ వంటివి మానసిక ఆరోగ్యానికి చాలా బాగా పనికొస్తాయి.
మెడిటేషన్: మెడిటేషన్ చాలామందికి చాలా బాగా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడమే కాకుండా శరీరంలో దీర్ఘకాలిక నొప్పులు ఏవైనా ఉంటే తగ్గిపోతాయి. నిద్ర బాగా పడుతుంది. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. మూడ్ మెరుగుపడుతుంది.
ఇలా చేయాలి: ప్రశాంతమైన ప్రదేశంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి లేదా పడుకోవాలి. తరువాత ఒక పదం లేదా వాక్యంను మైండ్‌లో అనుకుంటూ ఉండాలి. లేదంటే ఏదైనా ఒక వస్తువును చూస్తూ శ్వాస మీద దృష్టి నిలపాలి. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మైండ్‌లో ఆలోచనలు ఉప్పెనలా వచ్చిపడతాయి. వాటి గురించి అస్సలు పట్టించుకోవద్దు. వాటి ఫ్లోని ఆపకుండా శ్వాస మీద పూర్తి ధ్యాస పెట్టాలి.
డీప్ బ్రీతింగ్: దీన్ని ప్రాక్టీస్ చేస్తే శరీరంలో సహజంగానే రిలాక్సింగ్ సామర్ధ్యం పెరుగుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం రెస్పాండ్ అయ్యే పద్ధతిలో మార్పు వస్తుంది. బ్రెయిన్‌కి ఎక్కువ ఆక్సిజన్ సరఫరా జరిగి నాడీవ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది.
బెల్లీ బ్రీతింగ్ ట్రై చేయాలి. సౌకర్యంగా కూర్చొని, కళ్లు మూసుకుని ఒక చేతిని పొట్ట మీద ఉంచాలి. రెండో చేతిని ఛాతి మీద పెట్టాలి. ముక్కుతో దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు పొట్ట బయటకు రావాలి. తర్వాత శ్వాసను ముక్కుతో బయటకు వదలాలి. ఇలా చేసేటప్పుడు శరీరం రిలాక్స్ అవడాన్ని గమనించుకోవాలి. ఇదే ప్రాసెస్‌ను మళ్లీ రిపీట్ చేయాలి.
బయో ఫీడ్ బ్యాక్
ఒత్తిడికి గురైనప్పుడు గుండె కొట్టుకునే వేగం, కండరాల టెన్షన్, రక్త పీడనం ఎలా కంట్రోల్ చేయాలి అనేది నేర్చుకోవాలి. ఇది తెలియాలంటే రిలాక్స్ అవడానికి ట్రై చేసినప్పుడు శరీరం ఎలా రెస్పాండ్ అవుతున్నది అనేది తెలియాలి. ఆ విషయాన్ని చెప్తుంది బయోఫీడ్ బ్యాక్. ఈ ఫీడ్ బ్యాక్‌ను థెరపిస్ట్‌లు టెస్ట్ చేసి చెప్తారు.
నలుగురితో కలవడం
మీ మాటలు వినే కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్‌తో ఎక్కువ టైం ఉండాలి. ఒత్తిడి స్థాయిలు తగ్గేందుకు ఇది చాలా సహజసిద్ధమైన పద్ధతి. ఇలా మనసారా మాట్లాడుకునే వ్యక్తులను కలిసినప్పుడు శరీరం ఫైట్ ఆర్ ఫ్లయిట్ రెస్పాన్స్‌కు విడుదలయ్యే హార్మోన్ విడుదలను ఆపేస్తుంది. దానివల్ల రిలాక్స్ అవుతారు. మనుషులతో ఎలా ఉంటున్నారనే దాన్ని బట్టి మనుషుల్లో స్ట్రెస్ లెవల్స్ ఉంటాయి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.
అదే ఎవరేది అడిగినా ‘చేసేస్తా’ అనొద్దు. అందుకే దేనిగురించైనా రెస్పాండ్ అయ్యేముందు పది అంకెలు లెక్కపెట్టుకోవాలి. ఘర్షణ వాతావరణం ఉంటే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి. ఒత్తిడి కలిగించే ఆలోచనలు వస్తుంటే వాటినుంచి బయటపడేందుకు మ్యూజిక్ లేదా పాడ్‌కాస్ట్ వంటివి వినాలి. పుస్తకాలు చదవడం ఇష్టం ఉంటే మీకు నచ్చిన పుస్తకాన్ని చదవండి. అది అప్పటికి ఎన్నిసార్లు చదివింది అయినా కావచ్చు.
లోపలి మనసు
ఎవరి మనసు వాళ్లకు చెప్పే మాటకంటే మరేదీ అంత ప్రభావం చూపించదు. అందుకే నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని పాజిటివ్ ఆలోచనలతో బుల్డోజ్ చేయాలి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. దీనివల్ల జీవితకాలం పెరుగుతుంది. డిప్రెషన్ స్థాయిలు తగ్గుతాయి. మీరో విషయం గమనించారా? ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొందరికి జలుబు చేస్తుంటుంది. పాజిటివ్ సెల్ఫ్‌టాక్ వల్ల అలాంటి జలుబులు చేయవు. కార్డియోవాస్క్యులార్ వ్యాధులు కూడా దరిచేరవు. మనసు చెప్పింది విని అర్థం చేసుకుంటే కష్టకాలం నుంచి బయటపడేసే స్కిల్స్ వెన్నంటే ఉంటాయి.
నవ్వు ఓ థెరపీ
నవ్వినప్పుడు ఆక్సిజన్ బాగా విడుదలవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కండరాల్లో శక్తి నిండుతుంది. ఫీల్ గుడ్ హార్మోన్ విడుదలవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా మూడ్ బాగుంటుంది. అందుకే హాయిగా, మనసారా నవ్వాలి. అలా నవ్వినప్పుడు ఎంత పెద్ద కష్టాన్నైనా దాటేసే ఆలోచనలు అండగా ఉంటాయి.
చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకుంటున్న ఈ దసరా పండుగ సందర్భంగా మానసికంగా ఇబ్బందిపెట్టే ఆలోచనల్ని పక్కకు నెట్టిపారేయాలి. పాజిటివ్ ఆలోచనల్ని ఎంకరేజ్ చేయాలి. బుర్రను భారంగా, మనసును మోయలేనంతగా చేస్తున్న ఆలోచనలన్నింటినీ ఒక పేపర్ మీద రాసి, కాల్చి బూడిద చేసేయండి. మనసును ఒత్తిడి పెడుతున్న ఆలోచనల మీదే కాదు జీవితంలో కూడా విజయం మీదే.
సమస్య లేని వాళ్లు ఉండరు. సమస్య అనేది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. దానివల్ల ఒత్తిడికి గురై ప్రశాంతతను కోల్పోనక్కర్లేదు. ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం వస్తేనే జీవితాన్ని జయించిన వాళ్ళవుతారు.
మైండ్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో చెప్పాలంటే ప్రముఖ కవి కబీర్ దాస్ చెప్పిన ఈ మాటల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఓ మనసా! నువ్వు బంగారానివి అయి ఉంటే... రసాయనాలు వాడి నిన్ను నాకు నచ్చినట్టు తయారు చేసుకునేవాడ్ని. ఒకవేళ నువ్వు గుర్రానివి అయితే కళ్లెం వేసి అదుపుచేసేవాడ్ని. నువ్వు ఏనుగువి అయితే కాళ్లకు సంకెళ్లు వేసి అదుపు చేసేవాడ్ని. నువ్వు ఇనుము అయితే కొలిమిలో వేసి నాకు నచ్చిన రూపాన్ని తెచ్చేవాడ్ని...”
ఆ నవ్వు వెనక...
మనందరికీ సఫరింగ్ అంటే భయం. కానీ సఫర్ కావాల్సిందే. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎక్స్‌పీరియెన్స్ చేయాలి. కష్టాలు, కన్నీళ్లు అనేవి ఒక మూమెంట్ అనుకోవాలి. దానివల్ల మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఒక దశలో మన టైం బాగాలేదంటే... అది మన మంచికే అనుకోవాలి. కొంత కాలం తరువాత గతించిన కష్టాలు గుర్తుకు వస్తే నవ్వాలి. అంతేకాని వాటిని తలచుకుని ఏడవద్దు. గతంలో వంద జరుగుతాయి. ‘నేనప్పుడు అన్ని కష్టాలు పడ్డాను. ప్రేమిస్తే మోసం చేశారు. నమ్మితే గుండెలో పొడిచారు’ అని ఏడుస్తుంటే బుర్ర పెరగలేదని అర్థం. అలాకాకుండా కష్టాలను తలచుకుని నవ్వుకోవాలి. మన జీవితం అనేది సినిమా... ఆ సీన్ చూస్తున్నప్పుడు ఏడుపు వస్తే ఏడవాలి. అంతేకానీ పాత సినిమాలో ఫస్టాప్‌లో సీన్ గుర్తొచ్చి ఇప్పుడు సినిమా చూస్తూ ఏడిస్తే అది పనికి రాని పని. గుర్తు తెచ్చుకుని ఏడవడం అనేది అలా ఏడ్చే వాళ్లకు ఒక ఎంటర్టైన్మెంట్. ఇక్కడ అందరం కష్టాలు పడతాం. సఫర్ అయ్యి దాన్నుంచి బయటపడిన వాళ్ల కళ్లలో ఒక మెరుపు ఉంటుంది. యుద్ధం చేసి వచ్చిన వాడి ముఖం మీద చిన్న చిరునవ్వు కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. మనకి వాళ్ల చిరునవ్వు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ నవ్వులో ఒక లోతు ఉంటుంది.
పూరీ జగన్నాధ్, సినిమా డైరెక్టర్ (పూరీ మ్యూజింగ్స్ నుంచి)
గొప్ప అవకాశాలు వస్తే... ఏమీ చేతకాని వాళ్లు కూడా ఏదో ఒకటి సాధించవచ్చు.
ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా సాధించినవాళ్లే గొప్పవాళ్లు.ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే... వాళ్లని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది.ఎంత ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉన్నారనేది కాదు. వాళ్లలో అర్థం చేసుకునేవాళ్లు ఎందరు ఉన్నారనేది ముఖ్యం.