ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు జనగామలో గాలి వాన బీభత్సం

ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు జనగామలో గాలి వాన బీభత్సం

భద్రాద్రికొత్తగూడెం/యాదాద్రి/నల్గొండ/జనగామ, వెలుగు : ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు జనగామలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షానికి తోడు గాలులు వీయడం, వడగండ్ల పడడంతో పంటలు, ఇండ్లు దెబ్బతినగా, విద్యుత్‌‌ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. ఈదురుగాలుల కారణంగా చేతికొచ్చిన వరి నేలవాలగా.. మామిడికాయలు రాలిపోయాయి. యాదాద్రి జిల్లాలో వరి, మామిడి కలిపి సుమారు 150 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు.

సూర్యాపేటలో ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడగా, పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జనగామ జిల్లాలోపెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌లో ఉన్న వేలాది బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొంత మేర నీటిలో కొట్టుకుపోవడంతో కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.