లోక్​సభ నిర్మాణం..పూర్తి వివరాలు

లోక్​సభ  నిర్మాణం..పూర్తి వివరాలు

భారతదేశ అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంట్. రాజ్యసభ, లోక్​సభ, రాష్ట్రపతిలతో కూడిన పార్లమెంట్​ దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలు రూపొందిస్తుంది. బ్రిటన్ పార్లమెంట్​తో ప్రభావితమై 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్విసభా విధానం కాలక్రమంలో శాసన వ్యవస్థగా రూపొందింది. మన దేశం పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నందున కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు శాసన వ్యవస్థకు సమష్టి బాధ్యత వహిస్తున్నాయి. ప్రశ్నలు, తీర్మానాలు, ఆర్థికపర అంశాల ద్వారా పార్లమెంట్​మాదిరిగా సార్వభౌమాధికార సంస్థ కాకపోయినప్పటికీ రాజ్యాంగ సవరణలతోపాటు అన్ని రకాలైన శాసనాలను రూపొందిస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటుంది. ఉన్నత పదవుల్లోని వారిపై వచ్చే ఆరోపణలు విచారించి న్యాయపరమైన అధికారాలను నిర్వహించడంతో భారత పార్లమెంట్​ ప్రాధాన్యం సంతరించుకున్నది.

రాజ్యసభ

సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నందువల్ల పార్లమెంట్​లోని ఎగువ సభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికన్ సెనేట్ మాదిరి రాజ్యసభ రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించలేదు. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250గా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం 245 మందే ఉన్నారు. రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవలు మొదలైన రంగాల్లో విశిష్ట సేవలందించిన 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్​ చేస్తారు. దేశంలో కొత్తగా అఖిల భారత సర్వీసుల ఏర్పాటు చేయాలంటే 312 అధికరణ ప్రకారం రాజ్యసభ ప్రత్యేక తీర్మానం అవసరం. అలాగే, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా అంశం జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్నదని రాజ్యసభ భావిస్తే 249 అధికరణను అనుసరించి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు ఆ అంశంపై శాసనం చేసే అధికారం రాష్ట్రం నుంచి కేంద్రానికి బదిలీ అవుతుంది. అయితే, ఇది ఏడాది వరకే అమల్లో ఉంటుంది. అవసరమనుకుంటే మరో తీర్మానం ద్వారా పొడిగించొచ్చు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్​సభ రద్దయితే, రాష్ట్రపతి ప్రకటనను రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలి. లేకుంటే అత్యవసర పరిస్థితి 
రద్దవుతుంది. 

లోక్​సభ

81వ అధికరణ ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన లోక్​సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రజాస్వామ్య విధానంలో ప్రజలు ఎన్నుకున్న సభ తప్పనిసరి అయినందున మన దేశంలో లోక్​సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రభుత్వం ప్రజల ద్వారా ఏర్పడాల్సి  ఉన్నందున పార్లమెంటరీ విధానాన్ని అనుసరించే మన దేశంలో పార్లమెంట్​లో భాగమైన లోక్​సభలో మెజారిటీ సాధించిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. భారత రాజ్యాంగం లోక్​సభ సభ్యుల సంఖ్యను నిర్ధారించలేదు. కానీ, సంఖ్యను నిర్ణయించే పద్ధతి గురించి రాజ్యాంగంలో పొందుపర్చారు. 82వ ఆర్టికల్ ప్రకారం దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత ప్రభుత్వం ఒక డీలిమిటేషన్​ కమిటీని ఏర్పాటు చేస్తుంది.

 ఈ కమిటీ సూచనలను అనుసరించి పార్లమెంట్​ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారిస్తుంది. 1950లో ఏర్పాటైన మొదటి డీలిమిటేషన్​ కమిటీ ద్వారా నిర్ణయించిన మొదటి లోక్​సభ సభ్యుల సంఖ్య 489+2. 1962లో రెండో డీలిమిటేషన్​ కమిషన్​ 525+2గా నిర్ణయించింది. ప్రస్తుత లోక్​సభ సభ్యుల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు. 1972లో మూడో డీలిమిటేషన్​ కమిషన్​ సూచన ప్రకారం 31వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించిన గరిష్ట సభ్యుల సంఖ్య 550+2. 1973లో మూడో డీలిమిటేషన్​ కమిషన్​ సూచనలను అనుసరించి 530 మంది సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. 20 మంది సభ్యులు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 524. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య 19. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాలకు వరకు అంటే 2001 వరకు పార్లమెంట్, శాసనసభల స్థానాల సంఖ్య విషయంలో ఎలాంటి మార్పు చేయరాదని నిర్ణయించారు. 2001లో 84వ సవరణ ద్వారా మరో 25 సంవత్సరాలపాటు ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్యలో 2026 వరకు ఎలాంటి మార్పు చేయరాదని నిర్ణయించారు. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల సేకరణ ప్రకారం మాత్రమే సంఖ్యలో సవరణ చేయాలి. 

331వ అధికరణ ప్రకారం లోక్​సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తారు. 104వ రాజ్యాంగ సవరణను అనుసరించి 331వ అధికరణను భారత రాజ్యాంగం నుంచి తొలగించారు. 126వ రాజ్యాంగ సవరణ బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది 104వ రాజ్యాంగ సవరణగా ప్రభుత్వ గెజిట్​లో నమోదు చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ప్రస్తుతం దేశంలో వైశాల్యం రీత్యా అతి పెద్ద నియోజకవర్గాలు 1. లఢక్, బార్మర్(రాజస్థాన్), వైశాల్యం రీత్యా చిన్న నియోజకవర్గాలు లక్ష్యద్వీప్, చాందినీచౌక్(ఢిల్లీ),  ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్​గిరి, ఓటర్ల రీత్యా అతిచిన్న నియోజకవర్గం లక్ష్యద్వీప్, డయ్యూడామన్.


4వ డీలిమిటేషన్​ కమిటీ

ఎస్సీ, ఎస్టీ జనాభాలో వచ్చిన మార్పులను అనుసరించి ఎస్సీ, ఎస్టీ జనాభాలో పెరుగుదలకు అనుగుణంగా వారికి కేటాయించిన సీట్లలో మార్పులు, చేర్పులు చేయడానికి, అలాగే, నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని భౌగోళికంగా పార్లమెంట్​ నియోజకవర్గాలను పునర్​వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కుల్​దీప్​సింగ్ నేతృత్వంలో నాలుగో డీలిమిటేషన్​ కమిటీని ఏర్పాటు చేశారు. 2003లో చేసిన 87వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పునర్వ్యవస్థీ కరించారు. నియోజకవర్గాలను భౌగోళికంగానూ రిజర్వేషన్లపరంగానూ పునర్వ్యవస్థీకరించారు. కానీ, సంఖ్య విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. లోక్​సభలో డీలిమిటేషన్​కు ముందు ఎస్సీల సీట్లు 79 నుంచి ప్రస్తుతం 84కు పెరిగాయి. డీలిమిటేషన్​కు ముందు ఎస్టీల సీట్లు 41 నుంచి ప్రస్తుతం 47కు పెరిగాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను గెర్రీమాండరీంగ్​ అంటారు.