- మదర్ డెయిరీలో ఆధిపత్య పోరు
- చైర్మన్ పీఠంపై ముగ్గురు నేతల కన్ను
- ముగిసిన డెయిరీ చైర్మన్ కృష్ణారెడ్డి పదవీ కాలం
- ఈ సారి కుర్చీ దక్కించుకునేందుక పావులు కదుపుతున్న మాజీ చైర్మన్ జితేందర్‌రెడ్డి
- ఏడాది పాలనలో డెయిరీ అక్రమాల పైన జోరుగా ప్రచారం
- మరోవైపు పోటీకి రెడీ అవుతున్న డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి
నల్గొండ, వెలుగు : మదర్ డెయిరీలో మళ్లీ ఆధిపత్య పోరు రాజుకుంటోంది. డెయిరీ ప్రస్తుత చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియనుండడంతో పాటు మరో రెండు డైరెక్టర్ స్థానాలు ఖాళీ కావడంతో ఈ నెల 27 న మూడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డికి మరోసారి చైర్మన్ అవకాశం దక్కకుండా చేసేందుకు డెయిరీలో ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కృష్ణారెడ్డి ఏడాది పాలనలో డెయిరీలో చోటుచేసుకున్న అక్రమాలపైన జోరుగా ప్రచారం చేస్తోంది. డెయిరీలోని ప్రస్తుత పరిస్థితుల గురించి పూర్తిస్థాయి నివేదికను అటు ప్రభుత్వానికి, ఇటు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి పంపినట్లు తెలిసింది. మరోవైపు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి వర్గం కూడా చైర్మన్ పీఠం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. గతేడాది ఎన్నికల్లో చైర్మన్ స్థానం కోసం పోటీపడ్డ వర్గాలే మళ్లీ ఇప్పుడు తలపడుతున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యూహంతో గతేడాది ఎన్నికల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి తమ్ముడు జితేందర్‌రెడ్డి చైర్మన్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అదే విధంగా మెజార్టీ సొసైటీల మద్దతు ఉన్నప్పటికీ గొంగిడి మహేందర్‌రెడ్డి వర్గం కూడా అనివార్యంగా పోటీ నుంచి విరమించుకుంది. మంత్రి అనుచరుడైన కృష్ణారెడ్డిని చైర్మన్ చేసేందుకు పక్కా వ్యూహంతో జరిగిన గత ఎన్నికల నాటి పరిస్థితులే మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రత్యర్ధి వర్గం అలర్ట్అయింది.
అక్రమాలే ప్రచారస్త్రంగా..
కృష్ణారెడ్డికి మరోసారి చైర్మన్పదవి దక్కకుండా ఏడాది కాలంలో డెయిరీలో చోటుచేసుకున్న అక్రమాలు, పాలకవర్గం వైఫల్యాలనే వ్యతిరేక వర్గం ప్రచారస్త్రంగా చేసుకుంటోంది. ముఖ్యంగా పశువుల దాణా ఫ్యాక్టరీని మూసేసి, ప్రైవేటు కంపెనీల నుంచి దాణా కొనుగోలు చేయడంతో పాల ఉత్పత్తి తగ్గిందని దీంతో రోజుకు లక్ష లీటర్ల ఉత్పత్తి కావాల్సిన పాలు.. 37 వేల లీటర్లకు పడిపోయాయని ప్రచారం చేస్తున్నారు. బంధు ప్రీతితో రూల్స్‌కు విరుద్ధంగా సీనియర్లను కాదని జూనియర్లకు ప్రమోషన్లు ఇవ్వడం కూడా వివాదస్పదంగా మారింది. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 10 కోట్ల నష్టం రాగా, ఆ నష్టాలను పూడ్చుకునేందుకు రూ.5 కోట్లు ప్రైవేటు బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి డెయిరీని దివాళా తీయించారని, పాల బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ఇన్సెంటివ్ బిల్లులు రూ.20 కోట్ల వరకు రైతులకు బకాయి పడ్డారని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. పాలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో ఒక్క ఏడాదిలోనే 50కి పైగా సంఘాలు మూతపడ్డాయని, దీంతో ప్రైవేటుగా పాలు కొనుగోలు చేసి డెయిరీ నడుపుతున్నారని ఆ వర్గం డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. చివరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌కు సకాలంలో నెయ్యి కూడా సప్లై చేయలేని దుస్థితికి డెయిరీ చేరిందంటున్నారు.
గుత్తా జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి..
రూలింగ్పార్టీలో గ్రూపు రాజకీయాల వల్ల గతేడాది జితేందర్‌రెడ్డి చైర్మన్ పదవి వదులుకోవాల్సి వచ్చింది. అయితే కృష్ణారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టే సందర్భంలో సీఎంను కలిసిన జితేందర్‌రెడ్డికి.. పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో చైర్మన్ బదులుగా నల్గొండ జిల్లా పార్టీ బాధ్యతలైనా అప్పగిస్తారని జితేందర్ రెడ్డి ఆశపడ్డారు. కానీ ఏడాదైనా ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో తిరిగి తన పాత చైర్మన్ పదవి కావాలని ఆయన పట్టుబడుతున్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల సొసైటీ నుంచి చైర్మన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఈ ఎన్నికల్లో డైరెక్టర్‌గా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలిసింది.
పట్టుబిగిస్తున్న మహేందర్‌రెడ్డి వర్గం..
ప్రస్తుతం ఖాళీ అయిన 3 డైరెక్టర్ స్థానాల్లో గొంగిడి మహేందర్‌రెడ్డి నియోజకవర్గం ఆలేరు పరిధిలోని వంగపల్లి సొసైటీ కూడా ఉంది. దీంతో ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ సీటు వదులుకునేది లేదని మహేందర్‌రెడ్డి వర్గం తీర్మానించింది. మొత్తం 430 సంఘాలు ఉండగా, 278 సంఘాలు ఓటు హక్కు కలిగి ఉన్నాయి. దీంట్లో 150 పైగా సంఘాలు ఆలేరు సెగ్మెంట్లోనే ఉన్నాయి. మొత్తం పాల సేకరణలో 30 వేల లీటర్లు ఆలేరు నియోజకవర్గం నుంచే డెయిరీకి వెళ్తున్నాయి. మెజార్టీ సభ్యుల బలం తమకే ఉన్నందున ఆలేరు నియోజకవర్గానికే డెయిరీ చైర్మన్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు మదర్‌డెయిరీ చరిత్రలో ఆలేరుకు చోటు దక్కలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పార్టీ ఉమ్మడి జిల్లా గ్రూప్పాలిటిక్స్ వల్ల గతేడాది అవకాశం చేజారింది.. కానీ ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో ఛాన్స్ వదులుకోవద్దనే పట్టుదలతో ఉన్నారు.
డెయిరీని లాభాల పట్టించాం
మదర్ డెయిరీని లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నాం. చైర్మన్ గాఎన్నికైన ఏడాదిలోనే రెండు కోట్ల వృద్ధి సాధించాం. రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌లు రూ.20 కోట్ల పెండింగ్బిల్స్క్లియర్ చేశాం. పాల సేకరణ ధరలు పెంచాం. చైర్మన్‌గా ఎన్నికయ్యే నాటికి సంస్థ ముప్పై కోట్ల నష్టాల్లో ఉంది. జిల్లా మంత్రి సహకారంతో డెయిరీని డెవలప్ చేస్తున్నాం. కొంత మంది కుట్ర పన్ని డెయిరీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు.
– గంగుల కృష్ణారెడ్డి, మదర్‌డెయిరీ చైర్మన్