కామారెడ్డి జిల్లాలో సదరం సర్టిఫికెట్​ కోసం తిప్పలు

  • స్లాట్ దొరకాలంటే నెలలపాటు వెయిటింగ్​
  • రిజక్ట్​ అయితే మళ్లా బుకింగ్​ అయితలే 

కామారెడ్డి/ భిక్కనూరు, వెలుగు: జిల్లాలో సదరం సర్టిఫికెట్​ కోసం స్లాట్​ బుకింగ్​ సమస్యగా మారుతోంది. స్లాట్​ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఒకసారి రిజక్ట్​ అయితే మళ్లీ బుక్​ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్​ కీలకం. గతంలో జిల్లా హస్పిటల్​లో వారానికి ఒక సారి స్పెషల్​ క్యాంపు నిర్వహించి  సర్టిఫికెట్​ జారీ చేసేవాళ్లు. కానీ ఇటీవల ఆన్​లైన్​ బుకింగ్​ తో స్లాట్స్​ తీసుకొని క్యాంపునకు రావాలని రూల్​ పెట్టారు.  మీ సేవాలో స్లాట్​ బుక్​ చేసుకుంటే క్యాంపుకు రావాల్సిన డేట్​ వస్తుంది. ఆ రోజునే దివ్యాంగులు జిల్లా హస్పిటల్​కు రావాలి.  అయితే వారానికి 50 స్లాట్లు మాత్రమే ఇస్తున్నారు. వందల మంది స్లాట్ల కోసం ట్రై చేస్తే కేవలం పది శాతం మందికే స్లాట్లు దొరుకుతున్నాయి. ఒక్కో మీ సేవాలో రెండు లేదా మూడుకు మించి రావటం లేదు. దీంతో వారాలు, నెలల తరబడి ప్రయత్నించినా స్లాట్​ బుక్​ కావటం లేదని దివ్యాంగులు ఆవేదన చెంతున్నారు. కొందరి దగ్గర రెండేళ్లు, మూడేళ్ల గడువుతో సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆ గడువు ఆయిపోగానే పింఛన్​ ఆగిపోతోంది. మళ్లీ సర్టిఫికెట్​ తీసుకెళ్తేనే పింఛన్​ అందుతుంది. గడువు ముగిసన వారు కూడా స్లాట్ల కోసం తిరుగుతున్నారు. 

రిజక్ట్​ అయితే అంతేనా!

క్యాంపులో సదరం సర్టిఫికెట్​ జారీ చేయటంలో అప్లికేషన్​ రిజక్ట్​ అయితే మళ్లీ స్లాట్​ రావడం లేదు. మానసిక, ఇతర ఇబ్బందులున్న చిన్న పిల్లలు, సర్టిఫికెట్​టెస్టులు టైంలో సహకరించకపోవడంతో డాక్టర్ల టీమ్​ రిజక్ట్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఇలాంటి బాధితులు 500 మంది వరకు ఉన్నారు. 
 
పాపతో కనిపిస్తున్న ఈమె లింగంపేట మండలం ముంబాజీపేటకు చెందిన సునీత. తన ఎనిమిదేండ్ల పాప అక్షరకు పుట్టుకతోనే వైకల్యం ఉంది.  బిడ్డకు సదరం సర్టిఫికెట్ కోసం గతంలో ఒకసారి స్లాట్​ బుక్​ చేశారు.  క్యాంపునకు వెళ్లినప్పుడు పాప చిన్నగా ఉండటం, సహకరించక పోవటంతో రిజక్ట్​ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎన్ని సార్లు స్లాట్​ బుక్​ చేద్దాం అనుకున్నా  కావడం లేదు.  ఒకసారి రిజక్ట్​ అయితే మళ్లీ స్లాట్​ బుక్​ అవదని రిప్లయ్​ వస్తున్నట్టు సునీత తెలిపింది. 

3 నెలలుగా తిరుగుతున్నా.. 

నా చేయి ఒకటి పని చేయదు. సదరం సర్టిఫికెట్​ కోసం జిల్లా హాస్పిటల్​కు పోయిన. ఆన్​లైన్​లో స్లాట్​ బుక్​ చేసుకోవాలన్నారు. 3 నెలలుగా స్లాట్​ బుకింగ్​ కోసం తిరుగుతున్నా. కానీ బుక్​ కావటం లేదు. 

- సంజీవరెడ్డి, భిక్కనూరు

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం

సదరం క్యాంపు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. స్లాట్​ బుకింగ్​  ఆన్​లైన్​లో చేసుకోవాలి. నెలకు 300 నుంచి 400 మందికి స్లాట్​ ఇస్తున్నాం. అర్హులైన వారికి రిజక్ట్​ అయితే ఆఫీసర్ల పర్మిషన్​ తీసుకొని మళ్లీ స్లాట్​ ఇస్తున్నాం. 

- జాన్​, డీపీఎం సదరం క్యాంపు