క్రికెట్లో మరో శకం ముగిసింది. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్ భాగంగా ఓవల్‌లో జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు ముగిసిన తర్వాత బ్రాడ్ ..క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
2006లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన స్టువర్ట్ బ్రాడ్...తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాయిలను అధిగమించాడు. ఇంగ్లాండ్ తరుపున స్టువర్ట్ బ్రాడ్ 166 టెస్టుల్లో 600 వికెట్లు సాధించాడు. 121 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 56 టి20ల్లో 65 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ 2023 టోర్నీలో పాల్గొంటున్నాడు. 5 టెస్టుల్లో 20 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ తరపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. టెస్టుల్లో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలతో 3640 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌పై టెస్టులో 169 పరుగులు సాధించాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 260 మ్యాచులు ఆడి 930 వికెట్లు సాధించాడు. డేవిడ్ వార్నర్‌ని 17 సార్లు అవుట్ చేసిన స్టువర్ట్ బ్రాడ్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్‌ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
ఈ ప్రయాణం అద్భుతం..
జులై 31వ తేదీ నా క్రికెట్‌కి చివరి రోజు..ఇన్నేళ్ల క్రికెట్ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. నాటింగ్‌హమ్, ఇంగ్లాండ్ తరుపున ఆడడం గొప్ప గౌరవం భావిస్తున్నా. నేను క్రికెట్‌ని ఎంతగానో ప్రేమించా. ఈ సిరీస్ చాలా అద్భుతంగా సాగింది. ఎప్పుడూ టాప్‌లో ముగించాలని కోరుకున్నా. ఈ సిరీస్‌లో నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది..అంటూ స్టువర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
రికార్డులే రికార్డులు..
ఇంగ్లాండ్ తరపున జేమ్స్ అండర్సన్ 182 మ్యాచులు ఆడి మొదటి ప్లేస్ గా ఉండగా...స్టువర్ట్ బ్రాడ్ 166 టెస్టులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జేమ్స్ అండర్స్ 689 వికెట్లతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు. 600 వికెట్లతో స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు కలిసి దశాబ్దానికి పైగా బంతి పంచుకుంటున్నారు. స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ ఇద్దరూ కలిసి 1002 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. బ్రాడ్ కొన్ని వన్డేలకు, టీ20లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2010 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
బ్రాడ్ పేరు చెప్పగానే మనకు 2007 టీ20 వరల్డ్ కప్ గుర్తుకు వస్తుంది. ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న బ్రాడ్ కు ఆ రోజు చీకటి రోజు అని చెప్పాలి.2016లో చివరి వన్డే ఆడిన అతడు అప్పటి నుంచి కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు.