ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకపోవడం క్రికెట్ ప్రేమికులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న విరాట్.. చివరి మూడు టెస్టులకు కూడా దూరమవ్వడంతో సిరీస్ కల తప్పనుంది. కోహ్లీలోని దూకుడు ఈ సిరీస్ లో కనబడకపోవడంతో ఇప్పటికే పలువురు ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కోహ్లీ మిస్ అవ్వడంపై స్పందించాడు.
కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. BCCI గత వారం కోహ్లీ మొత్తం సిరీస్ నుండి వైదొలిగినట్లు తెలియజేసింది. అతని నిర్ణయాన్ని బోర్డు గౌరవించింది. కోహ్లీ లేకపోవడం సిరీస్ కే సిగ్గుచేటు. కోహ్లి నాణ్యమైన ఆటగాడు. అతని దూకుడు భారత్ మిస్ అవుతుంది. వ్యక్తిగత విషయాలకు మనం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. భారత బ్యాటింగ్ లైనప్‌లో ఎవరైనా ఏదో ఒక దశలో నిలదొక్కుకుంటారు. అని బ్రాడ్ అన్నారు.
5 టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైజాగ్ లో జరిగిన సెకండ్ టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసింది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టుకు కేఎల్ రాహుల్,రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులు ఆడటం అనుమానంగా మారింది. రాహుల్ ప్రాక్టీస్ మొదలుపెట్టినా.. జడేజా విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.