మొండికేస్తున్న కాంట్రాక్టర్లు... సూర్యాపేటలో ఐదారుసార్లు టెండర్లు రద్దు

సూర్యాపేట, వెలుగు : సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పని స్టార్ట్‌‌‌‌ చేసిందంటే దానిని దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు క్యూ కడుతుంటారు. కానీ సూర్యాపేట జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇప్పటికే రూ. కోట్లలో బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉండడంతో కొత్త పనులకు కనీసం టెండర్లు కూడా వేయడం లేదు. బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తామని ఆఫీసర్లు హామీ ఇస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు పూర్తైన పనులకు సంబంధించి సుమారు రూ. 50 కోట్లు రావాల్సి ఉంది. దీంతో పాత బిల్స్‌‌‌‌ అన్ని క్లియర్‌‌‌‌ చేస్తేనే కొత్తగా పనిచేస్తామని కాంట్రాక్టర్లు పట్టుబడుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు పెండింగ్‌‌‌‌లో పడుతున్నాయి. 

ఒక్కో పనికి నాలుగు సార్లు టెండర్లు

సూర్యాపేట జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా దాదాపు 400 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. వీటికి రిపేర్లు చేసేందుకు రూ.1.50 కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్లు ఎస్టిమేట్స్‌‌‌‌ పంపినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. శాంక్షన్‌‌‌‌ అయిన పనులకు టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆఫీసర్లు టెండర్లను వాయిదా వేస్తున్నారు. ఒక్కో పనికి నాలుగైదు సార్లు టెండర్లు పిలవాల్సి వస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. మరో పక్క ప్రజాప్రతినిధుల నుంచి ప్రెజర్‌‌‌‌ వస్తుండడంతో ఆఫీసర్లే కాంట్రాక్టర్లను బుజ్జగిస్తూ చిన్న చిన్న పనులను పూర్తి చేయిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మూడు పనులు చేసేందుకు గతంలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏపీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌‌‌‌తో పనులు పూర్తి చేయించారు. పనులు పూర్తి చేసి ఏడాది దాటినా బిల్లులు రాకపోవడంతో ఆ కాంట్రాక్టర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.

టెండర్ల దశలోనే నిలిచిన రోడ్ల రిపేర్లు

  • కోదాడ ఓల్డ్‌‌‌‌ నేషనల్‌‌‌‌ హైవేపై 8.5 కిలోమీటర్ల రోడ్డు పనుల కోసం 8 నెలల క్రితం రూ.5 కోట్లను ప్రభుత్వం శాంక్షన్‌‌‌‌ చేసింది. టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆఫీసర్లు ఇప్పటికి ఐదు సార్లు టెండర్లను రద్దు చేశారు. 
  • చివ్వెంల మండలం దురాజ్‌‌‌‌పల్లి నుంచి గరిడేపల్లి వరకు రోడ్డు అధ్వానంగా మారడంతో రిపేర్లు చేసేందుకు నిర్ణయించారు. ఆరు నెలల నుంచి టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పటికి మూడు సార్లు వాయిదా వేశారు. 
  • హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ బై పాస్‌‌‌‌ రోడ్డుపై 2 కిలోమీటర్ల మేర రిపేర్లు చేసేందుకు గతేడాది ప్రభుత్వం రూ.90 లక్షలు శాంక్షన్‌‌‌‌ చేసింది. ఇప్పటికి మూడు సార్లు టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు.

కాంట్రాక్టర్లు ముందుకొస్తే పనులు చేయిస్తాం 

ప్రభుత్వం నుంచి శాంక్షన్‌‌‌‌ అయిన వర్క్స్‌‌‌‌ కోసం టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చేలా చూస్తామని హామీ ఇస్తున్నా స్పందించడం లేదు. కాంట్రాక్టర్లు ముందుకు వస్తే పనులను పూర్తి చేస్తాం. 

– యాకూబ్, 
ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఈ‌‌‌‌ఈ, సూర్యాపేట