హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!

హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!

బీజింగ్: రోడ్డు విస్తరణల సమయంలో, కొత్తగా హైవేలు నిర్మించే సందర్భంలో కొన్ని ఇళ్లను, షాపులను కూలగొడుతుంటారు. బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి మరోచోట వారికి పునరావాసం కల్పిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం పరిహారం మాత్రమే చెల్లిస్తుంటుంది. చైనాలో కూడా అక్కడి ప్రభుత్వం ఇటీవల ఒక హైవే నిర్మాణానికి సంకల్పించింది. ఆ సందర్భంగా ఒక పెద్దాయన ఇంటిని కూడా కూల్చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది.

£180,000(2 కోట్ల రూపాయలు మన కరెన్సీలో) పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ఆ వృద్ధుడు తన ఇంటికి ఇంకా ఎక్కువ డబ్బు ఆశించి ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించలేదు. బెట్టు చేస్తే ప్రభుత్వం మెట్టు దిగొస్తుందని సదరు వృద్ధుడు దురాశకు పోయాడు. దురాశ దు:ఖానికి చేటనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా అతని పరిస్థితి తయారైంది.

అసలేం జరిగిందంటే.. చైనాలోని షాంగై సమీపంలోని జింగ్సీ పట్టణంలో హాంగ్ పింగ్ అనే వృద్ధుడికి రోడ్డు పక్కనే ఇల్లు ఉంది. హైవే నిర్మించడం కోసం ప్రభుత్వం ఆ ఇంటిని కూలగొట్టాలని డిసైడ్ అయింది. 2 కోట్ల పరిహారం ఆఫర్ చేసింది. మరింత డబ్బు ఆశించిన హాంగ్ పింగ్ గవర్నమెంట్ ప్రపోజల్కు ఒప్పుకోకపోవడంతో చైనా ప్రభుత్వం అతనికి పెద్ద ఝలకే ఇచ్చింది. అతని ఇంటికి ఎలాంటి నష్టం జరగకుండా ఇంటి చుట్టూ హైవేను నిర్మించింది. ఇప్పుడు ఆ వృద్ధుడి ఇల్లు హైవే మధ్యలో ఉంది.

ALSO READ | Spiritual : భగవంతుడిని ఎందుకు స్మరించాలి.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఇదే..

‘నిద్ర లేదు.. సుఖం లేదు.. దెబ్బ మీద దెబ్బ’ అన్నట్టుగా ఆ వృద్ధుడి పరిస్థితి తయారైంది. హైవే మధ్యలో తన ఇల్లు ఉండటంతో నిత్యం వాహనాల రణగొణ ధ్వనులతో ఆ వృద్ధుడికి, అతని కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేకాదు.. అతని ఇంటికి వెళ్లాలన్నా, ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా హైవే నిర్మాణంలో భాగంగా నిర్మించిన ఒక టన్నెల్ లోపల నుంచి వెళ్లాల్సిన పరిస్థితి.

ప్రభుత్వం 2 కోట్లు ఇస్తానంటే ఒప్పుకోనందుకు ఈ వృద్ధుడు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అప్పుడే అమ్ముకుని ఉంటే బాగుండేదని ఇప్పుడు సదరు ఇంటి యజమాని నిట్టూరుస్తున్నాడు. ఆ ఇంట్లో వృద్ధుడితో పాటు అతని భార్య, 11 ఏళ్ల వయసున్న ఆయన మనవడు కూడా ఉంటున్నారు.

హైవే మధ్యలో ఇల్లు ఉండటం, ఆ ఇంటికి వెళ్లాలంటే టన్నెల్ లోపల నుంచి వెళ్లాల్సి ఉండటంతో ఇదెక్కడి వింత ఇల్లంటూ హాంగ్ పింగ్ ఇంటిని చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. అలా వచ్చిన టూరిస్టుల నుంచి డబ్బు వసూలు చేసి  పోగొట్టుకున్న 2 కోట్లలో కొంతైనా సంపాదించుకోవాలని హాంగ్ పింగ్ భావిస్తున్నాడని తెలిసింది. డబ్బును కొంతైనా తిరిగి పొందగలుగుతాడేమో గానీ ప్రశాంతతను, నిద్రను కొనలేడుగా. ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం తప్ప హాంగ్ పింగ్ కుటుంబానికి మరో మార్గం లేదు. అందుకే అంటారు.. ఆలస్యం.. అమృతం.. విషం అని.