పర్వతగిరి, వెలుగు : ‘ఇంటి కాడ తిండి లేకనే మా అమ్మానాన్నలు హాస్టల్‌కు పంపించిండ్రు. ఇక్కడేమో పురుగుల అన్నం పెడుతున్నరు. ఎట్లా తినాలె. ఇదేంది అని వార్డెన్‌ను, వర్కర్లను అడిగితే ఆడపిల్లలం అని కూడా చూడకుండా గలీజు తిట్లు తిడుతున్నరు’ అంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మోడల్ స్కూల్ స్టూడెంట్లు శుక్రవారం స్కూల్ ఆవరణలో నిరసనకు దిగారు. ‘ఈ వార్డెన్... వర్కర్లు మాకొద్దు...జిల్లా ఆఫీసర్లు వచ్చే వరకు మేము అన్నం తినం’ అంటూ నినాదాలు చేశారు. పురుగుల అన్నం తినలేక కడుపు మాడ్చుకుంటున్నామని, టిఫిన్ సైతం కొంచెం..కొంచెం పెడుతున్నారని వాపోయారు.
వారానికి ఒకసారి పెట్టే చికెన్ ను కూడా వర్కర్లు దాచుకుంటున్నారని ఏడుస్తూ చెప్పారు. ఎవరైనా అడిగితే బూతులు తిడుతున్నారని ఆరోపించారు. వాష్‌రూంలు బాగా లేవని, వాటర్సరిగ్గా రావడం లేదన్నారు. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ సింగులాల్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, ఎస్సై దేవేందర్ స్కూల్‌కు వచ్చి స్టూడెంట్లకు నచ్చ చెప్పారు. వార్డెన్, వర్కర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకోసారి ఇలా కాకుండా చూస్తామని చెప్పి పిల్లలతో భోజనం తినిపించారు.