
- ఏపీ భీమిలిలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఘటన
హైదరాబాద్, వెలుగు: తన మొబైల్ ఫోన్ తీసుకున్నదని ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మహిళా లెక్చరర్ ను బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. ఈ దారుణం మంగళవారం ఏపీ భీమిలిలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకోగా.. దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లెక్చరర్ ఫోన్ తీసుకుందని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇవ్వను అనేసరికి సహనం కోల్పోయిన విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఇంజనీరింగ్ కాలేజ్ లో మొబైల్ వాడొద్దని విద్యార్థిని నుంచి ఫోన్ తీసుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో విద్యార్థిని ‘‘నా ఫోన్ రూ.12వేలు.. ఇస్తావా? ఇవ్వవా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా?” అంటూ బూతులు తిడుతూ లెక్చరర్ పై రెచ్చిపోయింది. లెక్చరర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడికి పాల్పడింది. ఆ తర్వాత లెక్చరర్, విద్యార్థిని మధ్య గొడవ పెరిగి ఇద్దరు కొట్టుకున్నారు. అక్కడే ఉన్న విద్యార్థులు, ఇతర లెక్చరర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్టూడెంట్ తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. లెక్చరర్లకు ఇచ్చే గౌరవం ఇదా అంటూ ఫైర్ అవుతున్నారు.