విద్యార్థి బంధు పథకం పెట్టాలె

కరోనా కాటుకు ఎంతోమంది బతుకులు ఆగమైపోయాయి. బడులు బంద్​ కావడంతో పేద విద్యార్థుల జీవితాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. చదువుకు దూరమై అన్ని విధాలుగా విద్యార్థులకు నష్టం జరిగింది. లాక్‌‌డౌన్‌‌ వల్ల ఇప్పటికే ఎంతో ఆర్థిక భారాన్ని మోస్తున్న కుటుంబాలకు తమ పిల్లల చదువులు మరింత భారంగా మారాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి బంధు పథకం తెచ్చి ప్రతి స్టూడెంట్​ బ్యాంకు ఖాతాలో పది వేల రూపాయలు జమ చేస్తే తల్లిదండ్రులకు కొంత ఆర్థిక భారాన్ని తగ్గించినట్లు అవుతుంది. స్కూలు ఫీజులు, పుస్తకాల ఖర్చులు ప్రభుత్వమే భరించి.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత విద్యా బోధన చేపట్టి, ఫీజులు లేని విద్యా సంస్థలను తయారు చేయాలి. ఇప్పటికే ఆన్​లైన్​ చదువుల పేరిట స్మార్ట్‌‌ ఫోన్ల కోసం అప్పుల పాలైతే.. ఇప్పుడు మళ్లీ బడికి వెళ్లేందుకు ఇతర వస్తువులు, ఫీజులు అంటే వారికి అదనపు భారమే. అందుకే విద్యార్థి బంధు అమల్లోకి వస్తే.. కష్టాలు తీరి వాళ్లు చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. లేకుంటే ఆర్థికంగా నష్టపోయిన ఎన్నో కుటుంబాల పిల్లలు విద్యకు దూరం కావాల్సి వస్తుంది. పిల్లలకు వ్యాక్సిన్ ఇంకా రాలేదు. వారికి రక్షణ సామాజిక బాధ్యత కనుక ప్రతి విద్యార్థికి మాస్కులు, శానిటైజర్లను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. ప్రభుత్వ బడుల్లో ప్రతి విద్యార్థికి ఉదయం పూట ఇమ్యూనిటి పెంచే డ్రైప్రూట్స్‌‌ వంటి ఆహారాన్ని ఇవ్వాలి. ధనిక రాష్ట్రంలో పైసలు లేక ఏ విద్యార్థి విద్యకు దూరం కాకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి.
                                                                                                                                                                 - ముచ్కుర్ సుమన్ గౌడ్, కరీంనగర్