తిట్టిన ప్రిన్సిపాల్, టీచర్లు​.. మనస్తాపంతో స్టూడెంట్​ ఆత్మహత్య

  • సూర్యాపేట జిల్లా ఆత్మకూర్​లో విషాదం
  • అనుమానాలున్నాయంటూ పేరెంట్స్, స్టూడెంట్​యూనియన్ల ఆందోళన 
  • బలవంతంగా పోస్ట్​మార్టానికి తరలింపు  
  • మార్చురీకి పేరెంట్స్​ తాళం

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల హాస్టల్​లో అర్ధరాత్రి లైట్ వేశాడని ప్రిన్సిపాల్​, టీచర్లు మందలించడంతో మనస్తాపానికి గురైన  స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రాకేశ్(14)  మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్​లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో లైట్లు వేసి ఉండడంతో ప్రిన్సిపాల్  వెంకటేశ్వర్లు, ఫిజిక్స్ లెక్చరర్ వినయ్ ఎవరు వేశారని స్టూడెంట్స్ ను ప్రశ్నించారు. దీంతో రాకేశ్ ​పేరు చెప్పడంతో  ప్రిన్సిపాల్ అతడిని మందలించాడు. బుధవారం టీచర్లు కూడా తిట్టడంతో మనస్తాపానికి గురైన రాకేశ్​ రాత్రి స్కూల్​లో టాయిలెట్స్ కు ఎదురుగా ఉన్న రేకుల షెడ్డుకు ఉరేసుకున్నాడు. గుర్తించిన తోటి విద్యార్థులు టీచర్లకు చెప్పారు.  

మృతిపై తల్లిదండ్రుల అనుమానాలు 

రాకేశ్ మృతిపై తల్లితండ్రులు ఆలకుంట్ల వెంకన్న-,  జయలక్ష్మి అనుమానాలు వ్యక్తం చేశారు. మృతదేహంపై గాయాలుండడంతో కొట్టి చంపారంటూ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. మరోవైపు బాధ్యులైన వారిని శిక్షించాలని స్టూడెంట్ యూనియన్ లీడర్లు స్కూల్ ముందు ధర్నా చేశారు. మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. తర్వాత డెడ్ బాడీని సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా పోస్ట్ మార్టం చేయకుండా రాకేశ్ పేరెంట్స్, బంధువులు మార్చురీ గదికి తాళం వేశారు. మృతికి బాధ్యులను గుర్తించి శిక్షించేంత వరకు పోస్ట్ మార్టం చేయించేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసులు, తహసీల్దార్​ ఘటనపై ఎంక్వైరీ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, రాకేశ్ కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోస్ట్​మార్టం తర్వాత నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురానికి డెడ్​బాడీని తీసుకెళ్లారు.