హైదరాబాద్ అశోక్ నగర్​లో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ అశోక్ నగర్​లో విద్యార్థిని ఆత్మహత్య
  • హాస్టల్​లో ఉరేసుకున్న వరంగల్​కు చెందిన ప్రవల్లిక
  • రెండేండ్లుగా అశోక్ నగర్​లో ఉంటూ ఉద్యోగాలకు ప్రిపరేషన్ 
  • ప్రభుత్వం ఎగ్జామ్స్ వాయిదా వేయడంతోనే సూసైడ్ చేసుకుందని నిరుద్యోగుల ఆరోపణ 
  • హాస్టల్​కు వందలాదిగా చేరుకుని అర్ధరాత్రి వరకు ఆందోళన 
  • డెడ్ బాడీని, సూసైడ్ నోట్ ను చూపించాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: వరంగల్ కు చెందిన విద్యార్థిని మర్రి ప్రవల్లిక (25).. హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆమె.. అశోక్ నగర్ లో తాను ఉంటున్న బృందావన్ గర్ల్స్ హాస్టల్ లో ఉరేసుకుంది. ఈ విషయం తెలిసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఎగ్జామ్స్ వాయిదా పడడంతోనే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. 

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రవల్లిక గ్రూప్స్ తో పాటు పలు పోటీ పరీక్షలు రాసింది. రెండేండ్లుగా  హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నది. పేపర్ లీకేజీలు, ఇతర కారణాల వల్ల గ్రూప్స్ తో పాటు పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రవల్లిక తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది” అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవల్లిక ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. 

నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు.. 

శుక్రవారం రాత్రి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం బయటకు రావడంతో నిరుద్యోగులు, స్టూడెంట్లు పెద్ద ఎత్తున హాస్టల్ కు చేరుకున్నారు. ఒక్కొక్కరుగా వందలాది మంది అక్కడికి వచ్చారు. ఓయూ జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల లీడర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎగ్జామ్స్ వాయిదా వేయడంతోనే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రవల్లిక మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, నిరుద్యోగులు అడ్డుకున్నారు. వందలాది మంది రోడ్డుపై భైఠాయించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రవల్లిక మృతదేహాన్ని చూపించాలని, సూసైడ్ నోట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరుద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. 

ఇంకెంత మంది చావాలి?: నిరుద్యోగులు 

ప్రవల్లిక సూసైడ్ విషయం తెలిసిన వెంటనే నిరుద్యోగులు, స్టూడెంట్లు పెద్ద ఎత్తున అశోక్ నగర్ లోని హాస్టల్ కు చేరుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాలనే ఆశతో వస్తే లీకేజీల సాకు చూపి వాయిదాలు వేస్తూ సర్కారు నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు. హాస్టల్ లోకి ఎవరినీ వెళ్లనివ్వకపోవడంతో స్టూడెంట్లు రోడ్డు మీదనే నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అశోక్ నగర్ వరకు రెండువైపులా విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ వచ్చి నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపారు.  

నన్ను క్షమించండి అమ్మా!

నేను చాలా నష్ట జాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడ్వకండి అమ్మా జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం ఏం చేయలేకపోతున్నా. అమ్మా నాన్న జాగ్రత్త! 

- సూసైడ్ నోట్ లో ప్రవల్లిక