- అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదన
- సర్టిఫికెట్తో అందించేలా ప్లాన్ చేస్తామని వెల్లడి
- వలస విధానంపై మాట మార్చిన మాజీ ప్రెసిడెంట్
- తెలివైన విద్యార్థులను చేజార్చుకోవద్దనే ఉద్దేశంతోనేనని కామెంట్
న్యూయార్క్: అమెరికా మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ తన వైఖరికి వ్యతిరేకంగా అనూహ్య ప్రతిపాదనతో ముందుకొచ్చారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వెంటనే ఫారిన్ స్టూడెంట్స్‌కు ఆటోమెటిక్‌గా గ్రీన్‌కార్డ్ ఇచ్చే కొత్త విధానాన్ని అమల్లోకి తీసురావాలని భావిస్తున్నట్టు చెప్పారు. ‘విదేశాల నుంచి వచ్చి మన యూనివర్సిటీలో చేరే విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే లోపు ఓ కంపెనీ ప్రారంభించే ఆలోచనో, మరో వినూత్న బిజినెస్ ఐడియానో అభివృద్ధి చేసుకుంటున్నారు.
గ్రీన్ కార్డ్ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడికి వెళ్లాక వారి ఐడియాలకు ప్రాణం పోసి విజయవంతమైన బిజినెస్ మెన్ గానో, ఎంట్రప్రెన్యూర్గానో ఎదుగుతున్నారు. వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. నిజానికి ఆ అవకాశాలన్నీ మన పౌరులకు దక్కాలి. కానీ గ్రీన్ కార్డ్ అందక స్వదేశాలకు వెళ్లిపోయే విద్యార్థులతో పాటే అమెరికన్ల అవకాశాలు కూడా పోతున్నాయి.
అందుకే తెలివైన విద్యార్థులను దేశంలోనే అట్టిపెట్టుకునేందుకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ ఆలోచన చేస్తున్నాం. నేను అధికారంలోకి రాగానే తొలుత దీనిపైనే దృష్టిసారిస్తా’ అంటూ ట్రంప్ ఓ పాడ్ కాస్ట్లో చెప్పుకొచ్చారు. ‘కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేయగానే ఫారిన్ స్టూడెంట్స్‌కు డిప్లొమాతోపాటు నేరుగా గ్రీన్‌కార్డ్ ఇవ్వాలని భావిస్తున్నాం. అది రెండేండ్లా, నాలుగేండ్లా అనే దాంతో సంబంధం లేకుండా కాలేజీ నుంచి డాక్టరేట్ డిగ్రీ అందుకున్న ప్రతి ఒక్కరికీ దీన్ని వర్తింపజేస్తాం. డిగ్రీ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులు ఇక ఇక్కడే ఉండొచ్చు” అని తెలిపారు. కరోనా సంక్షోభం వల్లే గతంలో దీన్ని అమలు చేయలేకపోయానని చెప్పుకొచ్చారు.
నాడు లీగల్ ఇమిగ్రేషన్‌పై ట్రంప్ ఆంక్షలు
అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ లీగల్ఇమిగ్రేషన్పై ఆంక్షలు విధించారు. హెచ్1బీ వీసాలతో అమెరికన్ల ఉపాధికి గండిపడుతుందని, అమెరికన్ల ఉపాధి అవకాశాలను విదేశీయులు దోచుకుంటున్నారని కామెంట్ చేశారు. వీసా లాటరీ విధానంలో మార్పులు చేశారు. అత్యంత స్కిల్ ఉన్న వారికి మాత్రమే బిజినెస్ వీసాలు జారీ చేసేలా సంస్కరణలు చేపట్టారు.
దీంతో దేశంలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండోసారి అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగిన ఆయన ప్రచార కార్యక్రమంలోనూ విదేశీ వలస విధానంపై విమర్శలు గుప్పించారు. అయితే, తాజాగా అందుకు భిన్నంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై తరచూ విరుచుకుపడే ట్రంప్ నోటినుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.