సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ‘స్టూడెంట్స్ కౌన్సిల్’ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. వర్సిటీ అభివృద్ధి నిర్ణయాల్లో ఇది కీలకం కానుంది. ప్రొఫెసర్ రవీందర్ ఓయూ వైస్ చాన్స్‌లర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్ ఏర్పాటు గురించి వెల్లడించారు.
లింగ్డో కమిటీ సిఫార్సు చేసినా..
1988లో ఓయూతో పాటు జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీల్లో ఘర్షణలు జరగడంతో స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ బ్యాన్ అయ్యాయి. వర్సిటీల్లో స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో మినిస్ట్రీ ఆఫ్హ్యూమన్ రిసోర్స్ డెవెలప్ మెంట్ మాజీ నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జేఎం లింగ్డో నేతృత్వంలో డిసెంబరు 2, 2005లో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏడాదిపాటు దేశంలోని యూనివర్సిటీల్లో పర్యటించి మే 26, 2006లో రిపోర్టు అందజేసింది. దీని ఆధారంగా 22 సెప్టెంబర్, 2006లో యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ ఎలక్షన్స్ పెట్టుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీం కోర్టు యూజీసీని ఆదేశించింది. అనేక సమావేశాలు జరిపిన అనంతరం 2015లో ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చని వర్సిటీలకు ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఇఫ్లూలో స్టూడెంట్స్ యూనియన్ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికైన ప్రతినిధులు వర్సిటీ అమలు చేసే పాలసీల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓయూలో లింగ్డో సిఫార్సులను అమలు చేయకుండా కొన్నేళ్లుగా తొక్కి పెడుతోంది.
కౌన్సిల్‌తో చెక్‌పెట్టేందుకు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ యూనియన్ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పరిస్థితులు లేకపోవడంతో కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యలకు చెక్‌పెట్టే దిశగా వర్సిటీ అధికా రులు అడుగులు వేస్తున్నారు. ఇటీవల వర్సిటీలో జరిగిన తక్ష్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ సైతం వర్సిటీల్లో స్టూడెంట్ యూనియన్స్ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ‘స్టూడెంట్స్ యూనియన్స్ లేవు. అందుకే డిబేట్స్జరగడం లేదు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వర్సిటీలకే ముప్పు వాటిల్లో ప్రమాదం ఉందని’ వినోద్వ్యాఖ్యానించారు. స్పందించిన అధికారులు యూనియన్‌కు బదులుగా నేరుగా స్టూడెంట్లను ఎంపిక చేసి కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రతి కాలేజీ నుంచి..
యూనివర్సిటీ క్యాంపస్, అనుబంధ కాలేజీల స్టూడెంట్లను కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఎన్నికైన ప్రతినిధులు స్టూడెంట్ల సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారు. అలాగే వర్సిటీ పాలసీలు, వాటి అమలులో కీ రోల్ పోషిస్తారు. ఎన్నికైన ప్రతినిధులు రెండేళ్ల పాటు కొనసాగుతారు. అయితే కౌన్సిల్ ఏర్పాటును పలు విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదంతా అధికారులు పబ్బం గడుపుకునేందుకు చేస్తున్న పనిలో భాగమని, కౌన్సిల్‌తో స్టూడెంట్లకు ఒరిగేదేమీ లేదంటున్నారు.