గొంతులో బొక్కలు ఇరుక్కుని పలువురు మృతి చెందిన ఘటనలు చూశాం. కానీ చపాతి గొంతులో ఇరుక్కుని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పరిధిలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో విరన్ జైన్ అనే విద్యార్థి ఆరవ తరగతి చదవుతున్నాడు. రోజు మాదిరిగా విరన్ జైన్ సోమవారం (నవంబర్ 25) స్కూల్కు వెళ్లాడు. లంచ్ బ్రేక్ సమయంలో ఇంటి నుండి తెచ్చుకున్న చపాతి తింటున్నాడు. ఈ క్రమంలో చపాతి విరన్ జైన్ గొంతులో ఇరుక్కుపోయింది.
తోటి విద్యార్థుల సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి విరన్ జైన్ చెందాడు. పాఠశాల సిబ్బంది విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న విరన్ జైన్ ఫ్యామిలీ మెంబర్స్.. ఉదయం నవ్వుకుంటూ స్కూల్కు వెళ్లిన కుమారుడు మధ్యాహ్నానికి విగతజీవిగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.