పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని అప్పో, సొప్పో చేసి మరీ లక్షల్లో ఫీజులు కట్టి స్కూళ్లకు పంపుతుంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు రకరకాల పేర్లతో లక్షల్లో దండుకుంటున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు.అడ్మిషన్ టైంలో సాంప్రదాయినీ.. సుద్దపూసని అన్నట్లు వ్యవహరించే స్కూల్ యాజమాన్యాలు.. ఒక్కసారి పిల్లలను స్కూల్లో చేర్చాక అసలు రూపం బయటపెడుతుంటాయి. స్కూల్ ఫీజు వసూలు చేయటం కోసం లోన్ రికవరీ ఏజెంట్ల కంటే దారుణంగా వ్యవహరిస్తుంటారు.. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. సూరత్ లో స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థినిని రెండురోజుల పాటు టాయిలెట్ దగ్గర నిలబెట్టింది ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ALSO READ | 8ఏళ్ళ బాలుడికి గుండెపోటు.. భయపెట్టాలనుకుంటే.. ఏకంగా ప్రాణమే పోయింది..
మంగళవారం ( జనవరి 21, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. సూరత్ లోని గోదాదర ప్రాంతంలో ఉన్న ఆదర్శ్ పబ్లిక్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది భావన అనే విద్యార్థిని. ఆమె తల్లిదండ్రులు సకాలంలో స్కూల్ ఫీజు చెల్లించకపోవడంతో భావనను పరీక్షకు అనుమంతించకుండా... రెండురోజుల పాటు టాయిలెట్ దగ్గర నిలబెట్టింది యాజమాన్యం. దీంతో మనస్తాపం చెందిన భావన తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఫీజు కట్టడం ఆలస్యమైతే పిల్లలను ఇంతలా అవమానిస్తారా అంటూ స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందటంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.ప్రైవెట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని.. ఫీజు కోసం అమానుషంగా వ్యవహరించి బాలిక ప్రాణాలు బలిగొన్న ఆదర్శ్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నెటిజన్స్.