
కారేపల్లి, వెలుగు: ఆరోగ్యం కుదుటపడేవరకు కాలేజీకి వెళ్లొద్దని పేరెంట్స్ మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పంతుల్‌నాయక్ తండాకు చెందిన బోడ మల్లీశ్వరి (17) ఖమ్మంలోని మహిళా కాలేజీ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. మల్లీశ్వరి వారం కింద అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు.
ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో ఈ నెల 2న కాలేజీకి వెళ్తానని మల్లీశ్వరి పేరెంట్స్‌కు చెప్పింది. దీంతో ఆరోగ్యం పూర్తిగా బాగయ్యే వరకు ఇంటి వద్దే ఉండాలని చెప్పి తల్లిదండ్రులిద్దరూ చేను వద్దకు వెళ్లారు. కాలేజీకి వెళ్లనివ్వడం లేదని మనస్తాపానికి గురైన యువతి గడ్డిమందు తాగింది.
చేను వద్ద పని ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు మల్లీశ్వరి వాంతులు చేసుకుంటుండడాన్ని గమనించి ఏం జరిగిందని అడిగారు. గడ్డి మందు తాగానని చెప్పడంతో వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సోమవారం చనిపోయింది. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజారామ్ చెప్పారు.