ఓయూలో షూటింగులు: వ్యతిరేకిస్తున్న స్టూడెంట్లు

ఓయూలో  షూటింగులు: వ్యతిరేకిస్తున్న స్టూడెంట్లు
  • పర్మిషన్‌‌ ఇవ్వాలని అధికారుల యోచన 
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్టూడెంట్ యూనియన్లు    

ఓయూ(హైదరాబాద్), వెలుగు: తెలంగాణ ఉద్యమానికి ప్రధాన వేదికగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఇకపై లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. రెడీ.. యాక్షన్.. వంటి డైలాగులు వినిపించనున్నాయి. నిధులు సమకూర్చుకునే నెపంతో ఓయూ క్యాంపస్ లో సినిమా షూటింగులకు అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే పాలకమండలి సమావేశంలో ఈ విషయాన్ని ఎజెండాలో చేర్చి తీర్మానం చేయనున్నారు. గతవారం యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలతో వైస్​చాన్స్​లర్ ప్రొఫెసర్​రవీందర్ యాదవ్ దీనిపై సమావేశం కూడా నిర్వహించారు. వర్సిటీ అభివృద్ధికి 21 పాయింట్ల ఫార్ములాతో ముందుకు సాగుతున్న ఓయూ అధికారులు వర్సిటీకి అవసరమైన నిధులను స్వంతంగా సమకూర్చునేందుకు సినిమా షూటింగులే ఏకైక మార్గమని నిర్ణయానికి వచ్చారు. అయితే, సమస్యలపై ప్రశ్నించే విద్యార్థుల గొంతు నొక్కేలా ఇప్పటికే ధర్నాలను నిషేధించిన అధికారులు.. ఓయూ చరిత్రను, ప్రైవసీని దెబ్బతీసేలా సినిమా షూటింగులకు అనుమతించడం ఏమిటంటూ స్టూడెంట్లు, మేధావులు తప్పుపడుతున్నారు. రిఫామ్స్ పేరుతో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వర్సిటీ మనుగడకే ప్రమాదంగా మారతాయని విమర్శిస్తున్నారు. 
షూటింగులొద్దు: స్టూడెంట్ యూనియన్లు  
ఓయూలో షూటింగులకు అనుమతించడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నాటి వందేమాతరం ఉద్యమం నుంచి నేటి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ఓయూలో జరిగిన అనేక ఉద్యమాలకు ఆర్ట్స్ కాలేజీ వేదికగా నిలిచింది. వందేమాతరం ఉద్యమం సందర్భంగా ఆర్ట్స్ కాలేజీపై జెండా ఎగురవేసినప్పుడు అప్పటి నిజాం నవాబు కూడా ఆంక్షలు పెట్టలేదని, ఇప్పుడు కాలేజీ దెబ్బతింటుందంటూ ధర్నాలు కూడా చేయనివ్వని అధికారులు షూటింగులకు ఎలా అనుమతిస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిధులు సమకూర్చుకునేందుకు ఇతర మార్గాలు ఉన్నాయని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు. వర్సిటీలోని అన్ని విభాగాల్లో రీసెర్చ్ ప్రాజెక్టులను తెచ్చి నిధులు సమకూర్చుకోవచ్చని ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్ అన్నారు. క్యాంపస్ వాతావరణాన్ని దెబ్బతీసే షూటింగులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వరాదని వారు డిమాండ్ చేశారు.