- హాస్టల్లో అర్ధరాత్రి సీనియర్లపై దాడి
- ఎదురుదాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ
హసన్‌పర్తి, వెలుగు: గంజాయి మత్తులో ఇంజినీరింగ్ స్టూడెంట్ హాస్టల్లో తోటి విద్యార్థులపై దాడి చేసిన ఘటన వివరాలు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ శివారులోని ఎస్ఆర్ యూనివర్సిటీలో ఆలస్యంగా తెలిశాయి. వర్సిటీ గంజాయికి అడ్డగా మారినా మేనేజ్ మెంట్ పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల కింద వర్సిటీ హాస్టల్ లో ఉంటున్న ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ రాత్రి గంజాయి తాగి హాస్టల్ లోని సీనియర్లను బూతులు తిడుతూ దాడికి దిగాడు. దీంతో సీనియర్లు కూడా ఎదురుదాడికి దిగారు. అప్పటికే నిద్రపోయిన స్టూడెంట్స్ రూమ్ ల నుంచి బయటకు వచ్చారు.
దీంతో హాస్టల్ లో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితంలేదు. పోలీసులకు సమాచారం అందడంతో హసన్ పర్తి సీఐ చేరాలు, ఎస్ఐలు వెళ్లి గంజాయి మత్తులో ఉన్న విద్యార్థిని చికిత్స కోసం అంబులెన్స్ లో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.
అయితే వర్సిటీ హాస్టల్ లో జరిగిన ఘటనపై యాజమాన్యం, పోలీసులు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. కాగా స్టూడెంట్ల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.