
- కేయూ వీసీ చాంబర్‌లో విద్యార్థి సంఘం లీడర్ల ఆందోళన
హసన్‌పర్తి, వెలుగు : పీహెచ్‌డీ సెకండ్ లిస్ట్ పెట్టాలంటూ విద్యార్థి సంఘం లీడర్లు సోమవారం కేయూ వీసీ చాంబర్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు స్టూడెంట్ యూనియన్ లీడర్లు మాట్లాడుతూ పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు ఉన్నాయని, అర్హత కలిగిన వారికి పీహెచ్‌డీ సీట్లు రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేయూలో పనిచేస్తున్న పార్ట్ టైం డిగ్రీ లెక్చరర్లకు, డీన్ల దగ్గర పనిచేస్తున్న స్కాలర్ల కుటుంబ సభ్యులకు పీహెచ్‌డీ సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
పీహెచ్‌డీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించకుండా కాలయాపన చేయడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వ్యక్తులకు పీహెచ్‌డీ అడ్మిషన్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా వీసీ సెకండ్ లిస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని స్టూడెంట్ యూనియన్ లీడర్లు హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరగంటి నాగరాజు గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కోఆర్డినేటర్ పాష, టీఆర్‌ఎస్‌వీ నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.