భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 20 ఏండ్ల ప్రవీణ్ కుమార్ అనే స్టూడెంట్ ఉరేసుకుని చనిపోయాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామానికి చెందిన ప్రవీణ్, ఈఈఈ విభాగంలో ఫస్టియర్ చదువుతున్నాడని ట్రిపుల్ ఐటీ అధికారులు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ నాలుగో ఫ్లోర్‌లోని ఓ గదిలో ప్రవీణ్ కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు ఇంటికి వెళ్తానంటే శనివారమే ప్రవీణ్‌కు ఔట్‌పాస్ ఇచ్చామని అధికారులు వివరించారు. ఇంటికి వెళ్లాడని తాము భావించినట్లు తెలిపారు. శనివారమే సూసైడ్ చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు మాత్రం కారణాలు తెలియరాలేవు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ తండ్రి చంద్రయ్య భోరున విలపించారు. వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే చంద్రయ్యకు ముగ్గురు కొడుకులు ఉండగా.. ప్రవీణ్ మొదటి వాడు. నాలుగు నెలల కిందే ప్రవీణ్ తల్లి పద్మ చనిపోయింది. పోస్టుమార్టం కోసం ప్రవీణ్ డెడ్‌బాడీని భైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటి వరకు నలుగురు సూసైడ్
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా నలుగురు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరిద్దరు ట్రిపుల్ ఐటీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సూసైడ్ కు పాల్పడ్డారు. ట్రిపుల్ ఐటీలో విధించిన కఠిన ఆంక్షలే స్టూడెంట్స్ ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది స్టూడెంట్స్‌కు అధికారులు ఇండ్లకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. దీంతో ఆఫీసర్ల తీరుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.