- మృతిని గోప్యంగా ఉంచిన యాజమాన్యం
- ప్రైవేట్ ఆస్పత్రి నుంచి హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి బాడీ తరలింపు
- బాలిక తల్లిదండ్రులతో కలిసి విద్యార్థి సంఘాల ఆందోళన
ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం సిటీలోని ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పల్లవి (16) అనే విద్యార్థి ఆదివారం కాలేజీ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట గ్రామానికి చెందిన అచ్చల కోటేశ్వరరావు సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు పల్లవి ఖమ్మం సిటీలోని ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఈనెల 7వ తేదీన ఆమె కాలేజీ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లి నాలుగు రోజుల క్రితం తిరిగి హాస్టల్‌కు వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తండ్రితో మాట్లాడింది.
4 గంటలకు పడుకుని బెడ్ మీద నుంచి కింద పడింది. పక్కన ఉన్న తోటి విద్యార్థినులు గమనించి ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. కళాశాల యాజమాన్యం వెంటనే ఖమ్మంలోని నెహ్రూ నగర్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు ఈసీజీ తీసి పరీక్షించారు. అప్పటికే పల్లవి మృతి చెందినట్లు చెప్పారు. అయితే, ఆమె చనిపోయిన విషయాన్ని కాలేజీ యాజమాన్యం పల్లవి తల్లిదండ్రులకు తెలియజేయలేదు. ఆమె మృతదేహాన్ని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి వెంటనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు.. ఆసుపత్రి మార్చురీలో పల్లవి విగతజీవిగా పడి ఉండటంచూసి తట్టుకోలేక తీవ్రంగా విలపించారు.
మృతిపై అనుమానాలు..
తమ బిడ్డ మృతి చెందిన విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించడంతో పల్లవి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకులకు తెలియడంతో పల్లవి తల్లిదండ్రులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం విద్యార్థిని టాబ్లెట్లు వేసుకుందని అందువల్లే గుండెపోటు వచ్చిందని చెపుతున్నారు. ఆసుపత్రి కేస్ షీట్ లో కూడా పల్లవి టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. అయితే, తమ బిడ్డకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, మాత్రలు వేసుకోవాల్సిన అవసరం తమ బిడ్డకు లేదని పల్లవి పేరెంట్స్ తెలిపారు.
3 గంటలప్పుడు పల్లవి తమతో ఫోన్ లో మాట్లాడిప్పుడు తనకు ఎలాంటి అనారోగ్యం ఉందని చెప్పలేదని వెల్లడించారు. హాస్టల్లో జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించేందుకు ఒక విద్యార్థిని ప్రయత్నించగా కాలేజీ యాజమాన్యం అడ్డుకున్నదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఎస్ఆర్ కళాశాల ఎదుట ప్రజాపంథా, పీఓడబ్ల్యూ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థిని మృతి చెందిందని, కాలేజీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్‌ను, యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని, స్టూడెంట్ మృతికి పరిహారంగా ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఇవ్వాలన్నారు. విద్యార్థిని పట్ల తల్లిదండ్రులు ఖానాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.