స్టాక్‌ మార్కెట్‌ పేరిట మోసపోయిన స్టూడెంట్‌

స్టాక్‌ మార్కెట్‌ పేరిట మోసపోయిన స్టూడెంట్‌
  • రూ. లక్షల్లో కొట్టేసిన సైబర్ నేరగాళ్లు 

బషీర్ బాగ్, వెలుగు: స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశపడిన ఓ విద్యార్థి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కాడు.  చివరకు రూ. లక్షల్లో కోల్పోయాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ  శివమారుతి తెలిపిన ప్రకారం... సిటీకి చెందిన ఓ విద్యార్థి ఆన్ లైన్ లో  టాటా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్  పేరిట స్టాక్ ట్రేడింగ్ ప్రకటనను చూశాడు. మొదట్లో కొంత  ఇన్వెస్ట్ చేయగా మూడు రెట్లు లాభాలు చూపించారు.  మరోసారి భారీగా ఇన్వెస్ట్ చేయగా.. అతడి అకౌంట్‌లోని డబ్బులు విత్ డ్రా కాలేదు.

బాధిత విద్యార్థి అవతలివైపు వారిని సంప్రదించగా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు చెల్లిస్తామని నమ్మించారు. దీంతో రూ. 8 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, లాభాలతో కలిపి మొత్తం 10.96 లక్షలు చెల్లిస్తామని సూచించారు.  దీనితో అతడు తన తండ్రి సాయంతో మరికొంత డబ్బును ఇన్వెస్ట్ చేశాడు. అనంతరం డబ్బులను విత్ డ్రా చేయగా,  సర్వీస్ ఫీ పేరిట డబ్బును డిమాండ్ చేశారు. దీంతో మోసపోయిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.