- ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఘటన
కల్లూరు, వెలుగు : ఫొటో తీసుకునేందుకు సాగర్ కెనాల్‌లోకి దిగిన ఇద్దరు స్టూడెంట్స్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు ఓ స్టూడెంట్‌ను కాపాడగా, మరొకరు నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కల్లూరు మండలం పడమర లోకవరం గ్రామానికి చెందిన పరిమి శివ (19) కల్లూరులోని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటూనే ఓ రెస్టారెంట్‌లో పార్ట్ టైం వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం తన ఫ్రెండ్స్ ఎదునూరి సంపత్‌సాగర్, కె.కల్యాణ్‌తో కలిసి పడమర లోకవరం గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్పీ మెయిన్ కెనాల్ ఫుట్‌బ్రిడ్జి వద్దకు వెళ్లారు. అక్కడ శివ, సంపత్ కాల్వలోకి దిగగా కల్యాణ్ గట్టుపై నిల్చొని ఫొటో తీస్తున్నాడు. ఈ క్రమంలో అదుపుతప్పి శివ, సంపత్ నీటిలో పడిపోయారు. పక్కనే పొలంలో పనిచేస్తున్న ఓ యువకుడు గమనించి పొడవాటి కర్రను అందించడంతో సంపత్ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ లోగా శివ నీట మునిగి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు కెనాల్ వద్దకు చేరుకొని శివ కోసం గాలింపు చేపట్టారు.