భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన డిగ్రీ స్టూడెంట్ రెహాన్ సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి ఎండీ. ఎజాస్ పేర్కొన్న ప్రకారం చుంచుపల్లి మండలం రాంనగర్‌కు చెందిన ఎండీ. రెహాన్ కొత్తగూడెంలోని ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో బీసీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం క్లాస్ రూంలో నిబంధనలకు విరుద్ధంగా రెహాన్ సెల్ ఫోన్ వాడుతున్నారని ప్రిన్సిపాల్ నయీం పాషా తనకు చెప్పారని ఎజాస్ పేర్కొన్నారు. దీంతో తాను కాలేజీకి వెళ్లానని, అక్కడ తన ముందే రెహాన్‌ను మందలించారన్నారు. తర్వాత తాను ఇంటికి వచ్చేశానని తెలిపారు. అదేరోజు రాత్రి ఇంటి నుంచి వెళ్లిన రెహాన్ తిరిగి రాలేదన్నారు. రాత్రంతా బంధువులు, ఫ్రెండ్స్ దగ్గరా వెతికినా దొరకకపోవడంతో శనివారం ఉదయం చుంచుపల్లి పీఎస్‌లో మిస్సింగ్ కేసు పెట్టామని తెలిపారు.
ఆదివారం రాంనగర్ సమీపంలోని కుంటలో రెహాన్ శవమై తేలాడు. స్థానికులు గమనించి తనకు చెప్పారన్నారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వైఖరి కారణంగానే రెహాన్ సూసైడ్ చేసుకున్నాడని ఆరోపిస్తూ డెడ్‌బాడీతో కాలేజ్ఎదుట ఆందోళన చేపట్టేందుకు స్టూడెంట్స్‌తో పాటు రెహాన్ కుటుంబసభ్యులు, బంధువులు యత్నించారు. పోలీస్‌లు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారు రోడ్డుపై బైటాయించారు. రెహాన్ మృతిపై సమగ్ర విచారణ చేపడతామని డీఎస్పీ రెహమాన్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. కాలేజ్వద్ద పోలీస్‌లు బందోబస్తు ఏర్పాటు చేశారు.