జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ దేశంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే స్పందించడంలో ఫస్ట్ ఉంటుంది. పార్లమెంట్‌పై టెర్రరిస్టులు దాడి చేసినా, ఆ దాడికి కారణమైనవాళ్లను ఉరి తీసినా, గోరక్షణ కోసం ప్రభుత్వం పిలుపునిచ్చినా, గోరక్షణ పేరుతో జనంలో ఒక వర్గంపై దండుదాడులు జరుగుతున్నా, హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా… ముందుగా ఖండించేది జేఎన్‌యూ విద్యార్థి సంఘాలే. ఢిల్లీలో యాభై ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ యూనివర్సిటీ మొదటి నుంచీ ప్రోగ్రెసివ్ ఐడియాలజీకి పెట్టింది పేరు. బ్రిటిషర్ల హయాంలో ఏర్పడ్డ ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా (సెంట్రల్ యూనివర్సిటీ)లు ట్రెడిషనల్‌గా సాగుతుండేవి. స్వాతంత్ర్యం వచ్చాక రెండో తరానికి చెందినది జేఎన్‌యూ. అప్పటికే మన దేశంలో కమ్యూనిస్టుల ప్రభావం బాగా పెరిగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ బాగా చర్చించుకోవడం, యాక్షన్ ప్లాన్‌తో ముందుకు సాగడం జరిగేది.
ఈ కారణాలతోనే ఢిల్లీలో చదువుకున్నవాళ్లు… రెండు సెక్షన్లకు ప్రతినిధులుగా ఉంటారని అంటారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నవాళ్లు ఏబీవీపీ పాలిటిక్స్‌ని, జేఎన్‌యూలో చదువుకున్నవాళ్లు కమ్యూనిస్టు ఆలోచనా ధోరణిని ఒంటబట్టించుకుంటారు. ఆ రెండు వర్సిటీల్లోనూ స్టూడెంట్ యూనియన్లలోనూ ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. దేశంలో అన్ని వర్సిటీల్లోనూ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలను నిషేధించారుగానీ, డీయూ, జేఎన్‌యూల్లో మాత్రం బ్యాన్ చేయలేకపోయారు.
ఇంత చరిత్రగల జేఎన్‌యూ మరోసారి మీడియాలో బేనర్ వార్తలకెక్కింది. దాదాపు మూడు నెలల క్రితమే జేఎన్‌యూలో స్టూడెంట్లు రోడ్డెక్కారు. హాస్టల్ రేట్లను 30 రెట్లు పెంచడాన్ని నిరసించారు. అయితే, హాస్టల్ నిర్వహణకోసమే పెంచుతున్నట్లుగా వర్సిటీ మేనేజ్మెంట్ ప్రకటించింది. జేఎన్‌యూ ప్రస్తుతం 45 కోట్ల రూపాయల నష్టంతో నడుస్తోందన్నది యాజమాన్యం వాదన. కరెంట్, వాటర్, ఉద్యోగుల జీతాలకు సైతం కటకట అవుతోందని రెండేళ్ల నుంచి స్టూడెంట్ యూనియన్లతో చెబుతున్నామంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే హాస్టల్ చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. రివైజ్ చేసిన చార్జీల ప్రకారం… జనరల్ స్టూడెంట్లకు నెలకు రూమ్ రెంట్, రోజూ మూడు పూటలా టిఫిన్, భోజనాలతో కలిపి 4,500 రూపాయలు అవుతుంది. దీనిలో మెస్ చార్జీల కింద 2,300 రూపాయలు, మిగతా మొత్తం 2,200లో సర్వీసు, యుటిలిటీ చార్జీలుండేలా చూశారు. పేద విద్యార్థులకు 50 శాతం రాయితీ ఇచ్చారు. అంటే, 2,300 మెస్కోసం, 1,100 సర్వీసుకి కలిపి బీపీఎల్ స్టూడెంట్లు 3,400 కట్టాల్సి ఉంటుంది. జేఎన్‌యూ హాస్టళ్లలో ఆరు వేల మంది స్టూడెంట్లు ఉంటారు. వాళ్లలో 5,371 మందికి ఫెలోషిప్, స్కాలర్షిప్ కింద ఆర్థిక సాయం అందుతోంది. కాబట్టి, బీద విద్యార్థులకు పెంచిన ఫీజులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వర్సిటీ మేనేజ్మెంట్ తెలిపింది.
దేశంలో మరే యూనివర్సిటీలోనూ లేనంత తక్కువ చార్జీలు జేఎన్యూలోనే ఉన్నాయని అక్కడి విద్యార్థులు చెబుతుంటారు. జేఎన్‌యూ యాజమాన్యం కూడా ఇదే మాట చెబుతూ, ఇతర వర్సిటీల్లో డెవలప్మెంటల్ ఫీజులు తీసుకుంటారని గుర్తు చేసింది. దాదాపు నలభై ఏళ్లుగా జేఎన్‌యూలో అసలు హాస్టల్ చార్జీలే పెంచలేదని చెప్పింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఫీజు 10,000 ఉండగా, జేఎన్‌యూలో కేవలం రూ. 300 మాత్రమే ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో పోయినేడాది అక్టోబరు 28 నుంచి స్టూడెంట్లు హాస్టల్ చార్జీల పెంపుపై నిరసన తెలుపుతూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో డీన్‌ని, వార్డెన్లను ఘెరావ్ చేశారు. నవంబర్‌లో హాస్టళ్లలో ఉండే గర్ల్ స్టూడెంట్లపై చేయి చేసుకున్నారు. నిన్నటికి నిన్ననే హాస్టల్లో గుర్తు పట్టకుండా మాస్క్‌లు వేసుకుని వచ్చి నానా బీభత్సం సృష్టించారు. 50 మంది వరకు చొరబడి హాస్టల్ ఇన్మేట్లను వెంటాడి మరీ ఇనుప రాడ్లు, లాఠీలు, హాకీ స్టిక్కులతో దాడి చేశారు. ఈ దాడిలో స్టూడెంట్ యూనియన్ చైర్పర్సన్ ఆయిషే ఘోష్ తలకు తీవ్ర గాయమైంది. మొదట్లో హాస్టల్ మెస్ చార్జీల తగ్గింపుకోసం ఆరంభమైన స్టూడెంట్ల నిరసన.. హింసాత్మకంగా మారడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
రూమ్ రెంట్ నెలకు 20/–!
జేఎన్‌యూలో హాస్టల్ చార్జీలను పెంచడానికి ముందు రూమ్ రెంట్ నెలకు రూ.20/– మాత్రమే. సవరించిన హాస్టల్ చార్జీల ప్రకారం నెలకు రూమ్ రెంట్ 600 రూపాయలయ్యింది. రూమ్‌ని ఇద్దరు షేర్ చేసుకునేలా ఉంటాయి. ఆరు నెలలకొకసారి జరిగే సెమిస్టర్ రిజిస్ట్రేషన్ జరగకుండా విద్యార్థులు సర్వర్‌ని పాడు చేశారు. మొదట్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాలు ఆందోళనల్లో పాల్గొన్నారు గానీ, ఆ తర్వాత ఏబీవీపీ వెనక్కి తగ్గింది. లెఫ్ట్ స్టూడెంట్స్ మాత్రం హాస్టల్ చార్జీల పెంపుపై సమ్మె కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం కంప్యూటర్ కేబుల్స్‌ని తెంపడానికి సమ్మెలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తుంటే, తాము అడ్డుకున్నామని ఏబీవీపీ స్టూడెంట్లు చెబుతున్నారు. అందువల్లనే తమపై రాడ్లు, స్టిక్కులతో దాడికి దిగారని
ఆరోపిస్తున్నారు.
యూనియన్లను రద్దు చేస్తారా?
ప్రస్తుతం దేశంలో ఏ యూనివర్సిటీలోనూ స్టూడెంట్ యూనియన్లకు ఎన్నికలు జరగడం లేదు. ఢిల్లీలోని జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీల్లోనే స్టూడెంట్ పాలిటిక్స్ ఉన్నాయి. ఈ రెండు వర్సిటీలు హ్యూమానిటీస్ సబ్జెక్టులకు మంచి ప్రాధాన్యతనిస్తాయి. సివిల్స్‌కి వెళ్లాలనుకునేవారు జేఎన్‌యూలో ఎక్కువగా చేరతారు. అయితే, దేశంలో ఏది జరిగినా ముందుగా స్పందించేది జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియనే అన్న ముద్ర పడింది. అందువల్ల ఢిల్లీలోకూడా ఎన్నికలు రద్దు చేయించే ఆలోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు.