పదునైన కత్తితో ఈజీగా ముంజల్ని తీస్తున్న ఈ అమ్మాయి పేరు ప్రీతి. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు సొంతూరు. మామూలుగా అయితే, వేసవి సెలవుల్లో పొద్దటి నుంచి సాయంత్రం వరకు ఆటలు ఆడుతుంటారు పిల్లలు. లేదంటే టీవీ చూడటమో, ఆన్లైన్ గేమ్స్ ఆడటమో చేస్తారు. కానీ, ఈ అమ్మాయి మాత్రం కుటుంబానికి అండగా ఉండాలి అనుకుంది. తాటి ముంజల సీజన్ అయిన ఈ ఎండాకాలంలో ముంజలు అమ్ముతూ తండ్రికి ఆసరాగా ఉంటోంది.
కొండగట్టు గుట్ట కింది ప్రాంతం తాటి ముంజలకు ఫేమస్. గౌడ కులస్తులు ఎండాకాలంలో కరీంనగర్, జగిత్యాల మెయిన్ రోడ్డు మీద తాటి ముంజలు అమ్ముతారు. ప్రీతి తండ్రి కోల తిరుపతి ఈ సీజన్లో ముంజలు అమ్ముతాడు. అమ్మ లక్ష్మి. అన్న సాయికుమార్ తమ కులవృత్తిని చేస్తున్నాడు. ప్రీతి నూకపల్లి మోడల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతోంది. అందుకని పొద్దున్నే స్కూల్‌కి వెళ్లి స్పెషల్ క్లాస్‌లు వింటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోడ్డు మీద చెట్టు నీడలో కూర్చొని ముంజలు అమ్ముతుంది. ఇంటికెళ్లిన తర్వాత పుస్తకాలు ముందరేసుకుని చదువుకుంటుంది. చదువుతో పాటు ఖో–ఖో ఆటలోనూ రాణిస్తోంది ప్రీతి. రెండేండ్ల క్రితం మోడల్ స్కూల్ సొసైటీ నిర్వహించిన స్టేట్ టోర్నమెంట్లో జగిత్యాల జిల్లా ఖో–ఖో టీమ్‌కి కెప్టెన్‌గా ఉండి, కప్ గెలిచింది ప్రీతి.
టీచర్ అవుతా...
‘‘మా నాన్న పదునైన కత్తితో చకచకా తాటి ముంజలు తీస్తుంటే ఆసక్తిగా గమనించేదాన్ని. నాకు కూడా ముంజలు తీయాలని అనిపించింది. అదే విషయం నాన్నతో చెప్తే, చేతులకి చిన్న గాయం కూడా అవ్వకుండా ముంజలు ఎలా తీయాలో నేర్పించాడు. ఫ్యామిలీకి నావంతు సాయం చేయాలని ఈ సెలవుల్లో ముంజలు అమ్ముతున్నా. అన్న ఎంకరేజ్‌మెంట్‌తో ఆటల్లో కూడా రాణిస్తున్నా. పెద్దయ్యాక టీచర్ కావాలనేది నా కోరిక’’ అని చెప్తోంది ప్రీతి.
: బూస గణేశ్, కొడిమ్యాల, వెలుగు