- ప్రేమించిన యువతి బంధువుల మీద అనుమానాలు
- పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉందంటూ ఆరోపణలు
నిజామాబాద్, వెలుగు: 28 రోజుల కింద కాలేజీకి వెళ్లిన డిగ్రీ స్టూడెంట్ ఇంటికి తిరిగి రాలేదు. పోలీసులకు కంప్లయింట్ చేసినా.. నేటి వరకు యువకుడి ఆచూకీ దొరకలేదు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్.. బోధన్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుకుంటున్న ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి కుటుంబసభ్యులకు తెలియడంతో.. శ్రీకాంత్‌ను బెదిరించారు. తమ కూతురికి అమెరికా సంబంధం వచ్చిందని, శ్రీకాంత్‌ను అదుపులో పెట్టుకోండని ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్దిరోజులకే(గత నెల 23 నుంచి) శ్రీకాంత్ కనిపించకుండా పోయాడు.
పోలీసుల తీరుపై అనుమానాలు..
శ్రీకాంత్ 28 రోజులుగా కనిపించకుండా పోయినా.. పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అగ్రవర్ణానికి చెందిన యువతి బంధువులు పరువు కోసం ఏదైనా హాని తలపెట్టి ఉంటారని భావిస్తున్నారు. యువతి కుటుంబీకుల మీద అనుమానం ఉందంటూ తమ కంప్లైంట్లో ఐదుగురి పేర్లను పేర్కొన్నారు. అయినా పోలీసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏసీపీ కిరణ్ మాట్లాడుతూ.. యువకుడి మిస్సింగ్కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానితులను విచారించామని, డిజిటల్ ట్రేసింగ్ ద్వారా ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.