బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీలో స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీలో స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌
  • వర్సిటీని ముట్టడించిన ఏబీవీపీ నాయకులు
  • కర్రలతో దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరికి గాయాలు

భైంసా/బాసర, వెలుగు : బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీ హాస్టల్‌‌‌‌ గదిలో ఓ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌‌‌‌ జిల్లా ఆర్మూర్‌‌‌‌కు చెందిన స్వాతిప్రియ వర్సిటీలో పీయూసీ 2 చదువుతోంది. సోమవారం ఉదయం స్టూడెంట్లు అందరూ టిఫిన్‌‌‌‌ కోసం వెళ్లిన టైంలో స్వాతిప్రియ తన గదిలో ఫ్యాన్‌‌‌‌కు ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన మిగతా స్టూడెంట్లు వర్సిటీ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం స్వాతిప్రియ డెడ్‌‌‌‌బాడీని భైంసా ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. స్వాతిప్రియ రాసిన సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌ను ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్టూడెంట్‌‌‌‌ తల్లిదండ్రులు వర్సిటీకి, అక్కడి నుంచి భైంసా హాస్పిటల్‌‌‌‌కు వచ్చారు. 

అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు

స్వాతిప్రియ మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి రవీందర్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు రోజుల కింద బీటెక్‌‌‌‌ థర్డ్‌‌‌‌ ఇయర్‌‌‌‌ చదువుతున్న ఓ అబ్బాయి తన కూతురికి ఫోన్‌‌‌‌ చేసి అసభ్యకరంగా మాట్లాడాడని, ఈ విషయాన్ని స్వాతిప్రియ తనకు ఫోన్‌‌‌‌ చేసి చెప్పగా వర్సిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలని సూచించానన్నారు. ఏవో రణధీర్, పీయూసీ డీన్‌‌‌‌ పావని, కేర్‌‌‌‌ టేకర్‌‌‌‌ స్రవంతి పట్టించుకోకపోవడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. స్వాతి ప్రియ సోమవారం ఉదయం కూడా ఫోన్‌‌‌‌ చేసి మాట్లాడిందన్నారు.

స్వాతిప్రియ డైరీ, లెటర్‌‌‌‌ను గోప్యంగా ఉంచడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. తమకు తెలియకుండా స్వాతిప్రియ డెడ్‌‌‌‌బాడీని హాస్పిటల్‌‌‌‌కు ఎందుకు తీసుకొచ్చారని ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్‌‌‌‌మార్టం చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో టౌన్‌‌‌‌ సీఐ గోపీనాథ్‌‌‌‌ నచ్చజెప్పారు. చివరకు స్వాతిప్రియకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో పోస్టుమార్టం పూర్తి చేసి డెడ్‌‌‌‌బాడీని తీసుకెళ్లారు.

ఏబీవీపీ కార్యకర్తలపై దాడి

స్వాతి ప్రియ ఆత్మహత్య విషయం తెలుసుకున్న నిర్మల్, నిజామాబాద్‌‌‌‌ జిల్లాలకు చెందిన ఏబీవీపీ కార్యకర్తలు ట్రిపుల్‌‌‌‌ ఐటీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో వర్సిటీ సెక్యూరిటీ గార్డులు కర్రలతో ఏబీవీపీ లీడర్లపై దాడి చేయడంతో ఏబీవీపీ కార్యదర్శి సాయికుమార్‌‌‌‌తో పాటు మరో కార్యకర్తకు గాయాలయ్యాయి. వీరిని భైంసా ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి, వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

స్వాతిప్రియ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆమె ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న భైంసా ఏఎస్పీ అవినాశ్‌‌‌‌కుమార్‌‌‌‌ వర్సిటీ వద్దకు చేరుకొని ఏబీవీపీ లీడర్లతో మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో వారు శాంతించారు.