బాసర ట్రిపుల్ ఐటీలో... అసలేం జరుగుతోంది?

బాసర ట్రిపుల్ ఐటీలో... అసలేం జరుగుతోంది?
  • రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు స్టూడెంట్స్​ మృతి

నిర్మల్, వెలుగు:  బాసర ట్రిపుల్​ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తోటి స్టూడెంట్స్​ను  బెంబేలెత్తిస్తున్నాయి.  క్యాంపస్​లో అసలేం జరుగుతుందో తెలియక విద్యార్థులు,  వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  ముఖ్యంగా క్యాంపస్​లో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా కౌన్సిలింగ్ చేయాలన్న ఎవరూ పట్టించుకోవడం లేదు.  రెగ్యులర్​ వైస్​ఛాన్సలర్, టీచింగ్​ ఫ్యాకల్టీ నియమాకాలతో పాటు ప్రధానమైన మెస్ కాంట్రాక్టర్ల మార్పు, హాస్టళ్లలో వసతుల కల్పన లాంటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. మంత్రి కేటీఆర్​తొమ్మిది నెలల క్రితం బాసర ట్రిపుల్​ఐటీకి వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.  మొత్తం12 డిమాండ్లు విద్యార్థులు మంత్రి ముందు ఉంచగా అందులో ఇప్పటికీ రెండు, మూడు సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయి.

వెంటాడుతున్న సమస్యలు...

ఏడాది నుంచి బాసర ట్రిపుల్​ఐటీ సమస్యలతో సతమతమవుతూనే ఉంది.  గవర్నర్​తమిళిసైతో పాటు మంత్రులు, ఆఫీసర్లు వచ్చి సమస్యలు తీరుస్తామని హామీలిచ్చి నెలలు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.  ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం ట్రిపుల్​ఐటీలో పరిపాలనకు శాపంగా మారుతోంది.  గతేడాది నుంచి వరుసగా ఏదో ఒక సంఘటన జరగడం సాధారణమైపోయింది.  

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదన్న అంశం పెద్ద ఉద్యమానికి కారణమైంది.  ఇక్కడి మూడు మెస్​ల నిర్వాహకులు తమకున్న రాజకీయ పలుకుబడితో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నాణ్యత లేని భోజనం తిని వందలాది మంది విద్యార్థులు ఫుడ్​ పాయిజన్​తో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మెస్​ కాంట్రాక్టర్లను మార్చాలన్న డిమాండ్​తో పాటు మొత్తం 12 డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం ఆపేది లేదని విద్యార్థులు పట్టుబట్టారు.  చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపస్​కు వచ్చి విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపారు.  అప్పటి నుంచి తాత్కాలిక చర్యలతో నెట్టుకొస్తున్న ఆఫీసర్లు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.  హాస్టల్​లో కరెంటు సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా పలు సంస్థలతో ఉద్యోగాల కల్పనకు ఎంఓయూలను చేసుకున్నారు.  ఇప్పటి వరకు విద్యార్థులకు కౌన్సిలింగ్​ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. 300 మంది టీచింగ్​ప్యాకల్టీని నియమించాల్సి ఉండగా.. 190 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. హాస్టల్​లో కుక్కలుస్వైర విహారం చేస్తున్నప్పటికీ వాటిని నియంత్రించకలేకపోతున్నారు.

వరుస సంఘటనలతో ఆందోళన

ట్రిపుల్​ఐటీలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్యాంపస్​లోని సిబ్బందిపై పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల ముందే వారు తరుచుగా గొడవలకు దిగుతున్నారు.  వారం రోజుల క్రితం విద్యార్థుల స్టడీ మెటీరియల్​ను సిబ్బంది బయట పడేయడం వివాదాస్పదమైంది.  ఇప్పటి వరకు క్యాంపస్​లో దాదాపు 20 మందికి విద్యార్థులు మరణించారు.  

గత సంవత్సరం రాథోడ్​ సురేశ్,  భానుప్రసాద్​ అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా..  ఈ ఏడాది పీయూసీ-1 విద్యార్థినీ వడ్ల దీపిక ఆత్మహత్య చేసుకుంది.  రెండ్రోజుల వ్యవధిలో మరో విద్యార్థిని లిఖిత అనుమానాస్పదంగా మృతి చెందడం భయాందోళనకు గురి చేస్తోంది.  క్యాంపస్​ సిబ్బంది విద్యార్థులను హాజరుశాతం, పరీక్షల పేరిట భయపెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

మారని మెస్​ కాంట్రాక్టులు..

విద్యార్థుల ఉద్యమానికి కారణమైన మెస్​ కాంట్రాక్టుల మార్పు వ్యవహారం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.  ఇక్కడ కేంద్రీయ బండార్​, ఎస్​ఎస్​క్యాంటీన్​, శక్తి క్యాంటీన్​లను వెంటనే మారుస్తామని అప్పట్లో మంత్రి కేటీఆర్​తో పాటు మంత్రులు, ఆఫీసర్లందరూ హమీలిచ్చారు. దీనికి సంబంధించి కొత్త మెస్​ కాంట్రాక్టర్ల నియామకానికి టెండర్లు కూడా పిలిచారు. అయితే ఈ టెండర్ల ప్రక్రియకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డు తగిలాయన్న ఆరోపణలున్నాయి. ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ కూడా ముందుకు రాలేదన్న సాకుతో స్వచ్ఛంద  సంస్థలకు మెస్​ నిర్వాహణ బాధ్యతలను అప్పజెప్పాలని ఆఫీసర్లు భావిస్తున్నారు.  

ఏడాది నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా పాత కాంట్రాక్టర్లనే కొనసాగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మూడు మెస్​ యాజమాన్యాల వెనక రాజకీయ అండ ఉందని విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందించినప్పటికీ వీరిపై ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. అధికారులు సైతం ఈ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు  ఆరోపిస్తున్నారు. 

ఐటీ మంత్రిగా హామీ ఇస్తున్నా.. 

 'తాను ఐటీ మంత్రిగా చెబుతున్నా..  మీరు రాజకీయాలకు అతీతంగా జరిపిన పోరాటాన్ని అభినందిస్తున్నా.. స్టూడెంట్​పవర్​ ను కల్లారా చూశా..  మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా..  చదువుపైనే దృష్టి పెట్టిండి.  ప్రతీ ఆరు నెలలకోసారి నేనే స్వయంగా క్యాంపస్​కు వచ్చి మీతో మాట్లాడుతా. గత ఏడాది సెప్టెంబర్​ 26న మంత్రి కేటీఆర్​ ట్రిపుల్​ఐటీకి వచ్చి చెప్పిన మాటలివి. కానీ ఆయన మాట ఇచ్చి తొమ్మిది నెలలైనా ఇప్పటివరకు క్యాంపస్​ మొహం కూడా చూడలేదు.