ఏటేటా పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. బయటపెట్టిన నివేదిక

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ నివేదికను బయటపెట్టింది. జనాభా పెరుగుదల రేటును మించి విద్యార్థుల ఆత్మహత్యల రేటు ఉన్నట్లు తమ నివేదికలో వెల్లడించింది. 

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా 'స్టూడెంట్ సూసైడ్స్: యాన్ ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా' పేరుతో వార్షిక IC3 కాన్ఫరెన్స్, ఎక్స్‌పో 2024 సందర్భంగా ఓ నివేదిక విడుదల చేయబడింది. ఈ నివేదిక ప్రకారం, దేశంలో మొత్తం ఆత్మహత్యల వార్షిక పెరుగుదల రేటు 2 శాతంగా ఉంటే, విద్యార్థుల ఆత్మహత్యల రేటు 4 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇది కేవలం నమోదైన కేసుల ఆధారంగా తీసుకున్న గణాంకాలు. బయట ప్రపంచానికి తెలియనివి.. గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేసినవి లెక్కలోకి వస్తే ఈ శాతం మరింత పెరిగేది.

గడిచిన దశాబ్ద కాలంలో 0 నుండి 24 ఏళ్ల వయస్కుల జనాభా 58.2 కోట్ల నుండి 58.1 కోట్లకు తగ్గగా.. విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కు పెరిగినట్లు నివేదిక బయటపెట్టింది. ముఖ్యంగా గత 20 ఏళ్లుగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో బాలలు/ యువకుల వాటా 53 శాతంగా ఉండగా.. 2021-22తో పోలిస్తే  పురుష విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గగా, అదే సమయంలో మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 7 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. 

రాష్ట్రాల వారీగా.. 

విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర(1,764 ఆత్మహత్యలు), తమిళనాడు(1,416 ఆత్మహత్యలు), మధ్యప్రదేశ్‌(1,340 ఆత్మహత్యలు)లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు ఈ మూడు రాష్ట్రాల్లోనే కనిపిస్తున్నట్లు  IC3 నివేదిక వెల్లడించింది. తరచూ వార్తల్లో రాజస్థాన్‌ ఈ జాబితాలో పదో స్థానంలోఉంది. దేశం మొత్తం ఆత్మహత్యల్లో 29 శాతం దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. ఐసీ3 అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు, వాటి నిర్వాహకులు, ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వంతోపాటు సలహాలు, సూచనలు, శిక్షణ ఇస్తుంది.