స్టూడెంట్​ అనుమానాస్పద మృతి

  • ప్రేయర్​లో కండ్లు తిరిగి పడిపోయిన గురుకుల విద్యార్థి
  • దవాఖానకు తరలించగాచికిత్స పొందుతూ కన్నుమూత

కొండమల్లేపల్లి, వెలుగు :  ఓ గురుకుల స్టూడెంట్​ అనుమానాస్పదంగా చనిపోయింది. ఎస్సై వీరబాబు కథనం ప్రకారం..నల్గొండ జిల్లా పెద్ద​అడిషర్లపల్లి మండలం అంగడిపేటకు చెందిన ఆంజనేయులు, ఆండాలు దంపతులకు ముగ్గురు బిడ్డలు. రెండో బిడ్డ దాసరి భార్గవి(14) కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల స్కూల్​లో 9వ తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన ఆమె తిరిగి ఆదివారం సాయంత్రం గురుకులానికి వచ్చింది.

సోమవారం ఉదయం ప్రార్థనలో నిలబడగా కండ్లు తిరిగి కిందపడిపోయింది. గమనించిన సిబ్బంది కొండమల్లేపల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్​కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. అయితే, తమ కూతురు ఆరోగ్యంగానే ఉందని, ఆకస్మాతుగా చనిపోవడంపై అనుమానాలు ఉన్నాయని స్టూడెంట్​తల్లిదండ్రులు అంటున్నారు. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.