కాళోజీ కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలు పెట్టాలి

కాళోజీ కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలు పెట్టాలి
  • హనుమకొండలో విద్యార్థి సంఘాల ఆందోళన

హనుమకొండ, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన కళాకారుల విగ్రహాలను కాళోజీ  కళాక్షేత్రంలో ఏర్పాటు చేయాలని  విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్​ చేశారు.  మూడు నెలలుగా ఉద్యమిస్తున్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సోమవారం హనుమకొండ చౌరస్తా నుంచి బాల సముద్రంలోని కళాక్షేత్రం వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతరం కళాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది.

కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు. అనంతరం విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ కళలు, కళాకారులతో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో విగ్రహాలను కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం తెలంగాణను అవమానించడమేనన్నారు. జాన పద, ఒగ్గు కథ, బుర్ర కథలతో  తెలంగాణ గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా చాటిన గద్దర్, చుక్క సత్తయ్య, మిద్దె రాములు, చిందు ఎల్లమ్మ, సాయిచంద్, బెల్లి లలిత, నేరెళ్ల వేణుమాధవ్, వరంగల్ శంకరన్న

సారంగపాణి, గుస్సాడి కనకరాజు వంటి కళాకారుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో సౌత్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్, విద్యార్థి సంఘాల నేతలు ఠాగూర్, మణితేజ, కుమార్, కలాం, నదీంపాషా, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.