
బషీర్బాగ్, వెలుగు : త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ చేశాయి. హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, గత పాలకుల మాదిరిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి అన్నారు. ఎస్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి, పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి అనిల్, పీడీఎస్ యూ (జార్జిరెడ్డి) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వర్ రావు, పీడీఎస్ యూ (విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి విజయ్ కన్నా మాట్లాడారు.