
ఘట్కేసర్, వెలుగు: తమకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంకుషాపూర్సంక్షేమ మహిళ ఆర్మీ కాలేజీ స్టూడెంట్లు ఆరోపించారు. శనివారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. ఆర్మీ కాలేజీని బీబీనగర్ మండలం అన్నపట్లం నుంచి అంకుషాపూర్‌కు తరలించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అక్కడ అన్ని వసతులతో కొనసాగుతుండగా, ప్రిన్సిపాల్ తన స్వలాభం కోసం ఇక్కడికి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంకుషాపూర్‌లో ఫిజికల్ట్రైనర్లు, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, శిక్షణకు కావాల్సిన వసతులు లేవని, ఆర్మీ డైరెక్టర్, మేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మండిపడ్డారు.
అంకుషాపూర్‌కు వచ్చినప్పటి ఉనంచి ఆర్మీ శిక్షణ ఆగిపోయిందని, నీటి సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిపి తమ భవిష్యత్ నాశనం చేస్తున్నారన్నారు. 400 మందికి అన్నం వండి 1,200 మందికి వడ్డిస్తున్నారని, అది కూడా మంచిగా ఉండడం లేదని వాపోయారు. స్థానిక మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు ఆందోళనకు సంఘీభావం తెలిపారు. పేరెంట్స్ కమిటీ అధ్యకుడు ఆంజనేయులు గౌడ్, ప్రధానకార్యదర్శి నర్సయ్య, కోశాధికారి యుగేందర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.