డ్రగ్స్పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు: వెన్నెల గద్దర్

డ్రగ్స్పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు: వెన్నెల గద్దర్

సూర్యాపేట, వెలుగు : విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడి తమ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ విద్యార్థి, యువజన సమితి సంస్థలు సంయుక్తంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక చైతన్య సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేడు సమాజానికి డ్రగ్స్ పెను సవాల్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సూర్యాపేట ప్రాంతం ఎంతో చైతన్యవంతమైనదని,  ఎన్నో ప్రజా ఉద్యమాలకు గడ్డ అని, అలాంటి ప్రాంతం డ్రగ్స్ బారిన పడుతుండడం బాధాకరమన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో డ్రగ్స్ పైన ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువతను చైతన్యం చేస్తామని పేర్కొన్నారు. ముందుగా   వెన్నెల గద్దర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సూర్యాపేట జిల్లాకు వచ్చినందున తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఆధ్వర్యంలో సన్మానించారు. 

తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా యూనిట్ కళాకారులు ఘన స్వాగతం పలికారు.  కార్యక్రమంలో యువ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలీమ్ పాష, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమేష్ శంకర్, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బండ నాగరాజు గౌడ్, యువజన సమితి జిల్లా అధ్యక్షుడు భిక్షం నాయక్, రైతు జన సమితి జిల్లా అధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి, జన సమితి జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.