కేయూలో హాస్టల్ ​షిఫ్టింగ్​ షురూ .. తృటిలో తప్పిన ప్రమాదం

  • పోతన హాస్టల్ పైఫ్లోర్ కొత్త బిల్డింగ్​లోకి..​
  • శుక్రవారం రాత్రి పెచ్చులూడిన హాస్టల్ సీలింగ్
  • 15 రోజుల కిందట సీలింగ్ ఫ్యాన్ పడి విద్యార్థినికి గాయాలు
  • ఆఫీసర్ల తీరుపై మండిపన విద్యార్థులు

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్ లో షిఫ్టింగ్​ చేపట్టారు. ఇటీవల వర్సిటీ క్యాంపస్ లోని పోతన హాస్టల్ లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినికి గాయాలయ్యాయి. తాజాగా, శుక్రవారం రాత్రి రూమ్ నెంబర్​ 94లో సీలింగ్ పెచ్చులూడి కిందపడింది. దీంతో ఓ విద్యార్థినికి ప్రమాదం త్రుటిలో తప్పింది. విషయం తెలుసుకుని హాస్టల్​కు చేరుకున్న రిజిస్ట్రార్ ను విద్యార్థులు అడ్డుకుని, ఆందోళన చేపట్టారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన, విద్యార్థులను రూ.10 కోట్లతో కొత్తగా నిర్మించిన 'సమ్మక్క' హాస్టల్​ బిల్డింగ్​లోకి షిఫ్ట్ చేస్తున్నారు.

రూ.80 లక్షలు ఏమైనయ్​..?

2022 లో న్యాక్ పేరు మీద కేయూలోని అన్ని హాస్టళ్లను రిపేర్ చేయడానికి 139 వ పాలక మండలి సమావేశంలో అప్పటి వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ చైర్మన్ గా ఉండి రూ.80.46 లక్షలను కేటాయించారు. ఇందులో పోతన హాస్టల్ రిపేర్లు, వాటర్ సప్లై, శానిటరీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం రూ.5.30 లక్షలు ఖర్చు చేశారు. కానీ, హాస్టల్ కు పెయింటింగ్ కు తప్ప ఏ పనీ చేయలేదని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.

క్షేత్రస్థాయి పరిస్థితి కూడా అదే విషయం స్పష్టం చేస్తోంది. గణపతిదేవ-1కు రూ.9.90 లక్షలు, గణపతిదేవ-2కు రూ.4.35 లక్షలు, గణపతిదేవ-3కి  రూ.7.20 లక్షలతో పనులు స్టార్ట్ చేశారు కానీ, పూర్తి చేయకుండానే ఫండ్స్ డ్రా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేపట్టిన పనులు కనిపించకపోవడంతో రూ.80.46 లక్షలు ఏమైనయ్​ అని విద్యార్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త హాస్టల్ కు విద్యార్థులు..

పోతన హాస్టల్ ఘటన నేపథ్యంలో విద్యార్థులు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆందోళన చేపట్టారు. అక్కడకు చేరుకున్న రిజిస్ట్రార్​ పి.మల్లారెడ్డిని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శనివారం ఉదయం రిజిస్ట్రార్ మళ్లీ హాస్టల్ ను విజిట్ చేసేందుకు రాగా, అప్పటికే అక్కడికి చేరుకున్న వివిధ విద్యార్థి సంఘాల నేతలు రిజిస్ట్రార్ ను అడ్డుకుని సమస్యలపై నిలదీశారు. అనంతరం రిజిస్ట్రార్ హాస్ట ల్ ను పరిశీలించారు. పోతనపై ఫ్లోర్​లోని విద్యార్థులను ఖాళీ చేయించి, కొత్త బిల్డింగ్​లోకి షిఫ్ట్ చేశారు. హాస్టల్ సమస్యతోపాటు కుక్కలు, పాములతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ప్రభుత్వం దృష్టి పెట్టాలని విద్యార్థులు డిమాండ్​ చేస్తున్నారు.

రిపేర్లకు నోచుకోని ఓల్డ్​బిల్డింగ్..

1968లో కేయూను ఏర్పాటు చేసిన సమయంలో క్యాంపస్ లోని పోతన హాస్టల్ ను నిర్మించారు. ఇందులో దాదాపు 96 రూమ్స్ ఉండగా, 200 మంది వరకు విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. గతేడాది వరకు పోతనను బాయ్స్ హాస్టల్ గానే వినియోగించారు. కానీ, క్యాంపస్ లో అమ్మాయిల స్ట్రెంథ్​ పెరిగిపోవడంతో అప్పటి వీసీ ఆ హాస్టల్ ను అమ్మాయిలకు కేటాయించి, బాయ్స్ ను ఖాళీ చేయించారు. పోతన హాస్టల్ పేరును రుద్రమాదేవిగా మార్చారు. ఈ బిల్డింగ్ నిర్మించి 55 ఏండ్లు దాటుతుండగా, మూసేయాలని గతంలోనే ఇంజినీర్లు సూచించినట్లు తెలిసింది. అధికారులు రిపేర్లు చేయక, సీలింగ్ పైన నీళ్లు నిలిచి ఉండటంతో పైకప్పు నానిపోయి పెచ్చులూడి పడే స్థితికి చేరింది.