పీయూలో సమస్యల తిష్ట .. ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్

పీయూలో సమస్యల తిష్ట .. ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్
  • న్యూ పీజీ, ఫార్మసీ హాస్టళ్ల​లో సౌలతుల్లేవ్
  • విరిగిన బాత్​రూమ్​ తలుపులు, ఊడిన కిటికీ అద్దాలు
  • డ్రైనేజీ లీకేజీతో కంపు కొడుతున్న పరిసరాలు

మహబూబ్​నగర్/మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో సమస్యలు తిష్ట వేశాయి. వర్షాకాలం కావడంతో అటు పందులు, ఇటు మురుగు నీటితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు డ్రైనేజీలు జామ్​ అవుతుండడంతో కంపు వాసనను భరించలేకపోతున్నారు. దీనిపై వర్సిటీ అధికారులకు కంప్లైంట్​ చేసినా పట్టించుకోకపోవడంతో స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ లీకేజీలు..

వర్సిటీలో మూడు బాయ్స్​ హాస్టల్స్​ ఉండగా, రెండు హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేశాయి. వర్షాకాలం కావడంతో దోమలు కూడా ఎక్కువవుతున్నాయి. దీంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. 

  • బాయ్స్ న్యూ పీజీ హాస్టల్​ను కొన్ని నెలల కింద ఓపెన్  చేశారు. ఈ బిల్డింగ్​లో రెండు ఫ్లోర్లు ఉన్నాయి. హాస్టల్​ గ్రౌండ్​ ఫ్లోర్​లో ఉన్న సింక్​లు తరచూ నిండిపోతున్నాయి. ఫస్ట్​ ఫ్లోర్, సెకండ్​ ఫ్లోర్లలోని వాష్​ బేసిన్లు, సింక్​ల నుంచి వస్తున్న నీళ్లు గ్రౌండ్​ ఫ్లోర్​లోనే ఆగిపోతున్నాయి. ఈ సింక్​లను ప్రతి రోజూ క్లీన్​  చేయాల్సి ఉండగా, వారంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే క్లీన్​ చేస్తున్నారు. దీంతో చెత్త అక్కడే పేరుకుపోయి సింక్​ జామ్​ అయి, నీళ్లు బయటకు వస్తున్నాయి.
  •     వర్సిటీలో క్రీడాకారుల కోసం కొద్ది నెలల కింద రూ.9 కోట్లతో 400 మీటర్ల సింథటిక్​ ట్రాక్​ను ఏర్పాటు చేశారు. వర్షం వస్తే ట్రాక్​ మీద నీరు నిలబడకుండా బయటకు వెళ్లాలి.  కానీ, ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ట్రాక్​ మీద నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో విద్యార్థులు రన్నింగ్​ ప్రాక్టీస్​ చేసుకోలేకపోతున్నారు.
  •     న్యూ పీజీ, ఫార్మసీ హాస్టళ్లలో ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడి బాత్​ రూమ్స్, టాయిలెట్స్​కు తలుపులు లేవు. దీంతో వీటిని స్టూడెంట్లు వాడడం లేదు. అలాగే ఈ హాస్టళ్లలోని గదుల్లో కిటికీలకు తలుపులు లేవు. కొన్నింటికి అద్దాలు ఊడిపోయాయి. వర్షాకాలం కావడంతో వర్షపు నీరంతా గదుల్లోకి చేరుతోంది. దీంతో రాత్రి పూట వర్షం పడితే స్టూడెంట్లు జాగరణ చేస్తున్నారు.
  •     న్యూ పీజీ, ఫార్మసీ హాస్టళ్లకు సంబంధించిన డ్రైనేజీ పైపులైన్​ను ఈ రెండు బిల్డింగ్​ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోకి పోయేలా కనెక్షన్​ ఇచ్చారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న మ్యాన్​ హోల్స్​ నుంచి డ్రైనేజీ నీరు లీకవుతోంది. ఈ నీరంతా హాస్టల్స్​ పరిసరాల్లోకి చేరుతుండడంతో కంపు వాసన వస్తోంది. పందులు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ విషయంపై పీయూ ఆఫీసర్లకు కంప్లైంట్లు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
  •     ఈ హాస్టళ్లలో స్టూడెంట్ల కోసం భోజనాన్ని ఆరుబయటే వండుతున్నారు. ఈ రెండు హాస్టళ్లకు కిచెన్​ షెడ్​ లేకుపోవడంతో, ఆరుబయట వంటలు చేసేందుకు తిప్పలు పడుతున్నారు. వర్షం పడితే వంటలు చేసే పరిస్థితి లేకుండా పోతోంది. ప్రస్తుతం ఉన్న షెడ్​కు పైన రేకులు తప్ప చుట్టూ గోడలు కూడా లేవు.
  • వర్సిటీలో లైబ్రరీ ఉన్నా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో లేవని, చాలా సందర్భాల్లో స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. పోటీ పరీక్షలు, అకడమిక్​ పుస్తకాలు లేక చదువుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్టూడెంట్లు వాపోతున్నారు.

ఏడాదైనా పరిష్కరిస్తలేరు..

హాస్టళ్లలో బాత్​ రూమ్స్​కు డోర్స్​ లేవు. కిటికీలకు అద్దాలు లేక వర్షం పడితే నీళ్లు గదుల్లోకి వస్తున్నాయి. పందులు తిరగడంతో కంపు వాసన వస్తోంది, దీనిపై పలుమార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ఎవరూ పట్టించుకుంటలేరు. ఏడాదిగా ఈ సమస్యను పరిష్కరిస్తలేరు.

అర్జున్, ఎంబీఏ, సెకండ్​ ఇయర్

క్యాంటీన్ ను ఓపెన్​ చేస్తలేరు..

లైబ్రరీ రీడింగ్ హాల్ రూమ్​ను ఎంపీ ఎలక్షన్లలో ఈవీఎంలు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్​గా వాడారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాయి. ఎప్పటిలాగా రీడింగ్ హాల్ వినియోగంలోకి తెచ్చినా ఫర్నీచర్ ను ఏర్పాటు చేయలేదు. లైబ్రరీలో అకడమిక్​ ఇయర్స్  బుక్స్  అప్​డేట్  రావడం లేదు. పాత బుక్స్ తోనే వెళ్లదీయాల్సి వస్తోంది.

కృష్ణ కుమార్, ఎమ్మెస్సీ మ్యాథ్స్, సెకండ్ ఇయర్