వామ్మో.. గురుకులాలు .. సౌకర్యాలు నిల్.. సమస్యలు ఫుల్

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాల్లోని గురుకులాలు సమస్య వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గురుకులాల్లో సమస్యలను పరిష్కరించకుండా.. ఆ సమస్యలు బయటికి రాకుండా కప్పిపెడుతున్నారు. ఇటీవల గురుకులాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసినా పెద్దగా మార్పు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు పెదవి విరుస్తున్నారు. 

ప్రైవేట్​ భవనాలకు నెలకు రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నారని, అదే శాశ్వత భవనాలు నిర్మిస్తే ఇప్పటివరకు అంత ఖర్చయ్యేది కాదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల రేకుల షెడ్లను అద్దెకు తీసుకుని పాఠశాలలను కొనసాగిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారుల స్పందించి గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.