సర్దుబాటుతోనే సరి.. రెగ్యులర్ టీచర్ పోస్టుల భర్తీపై తేల్చని సర్కార్ 

  •     జిల్లాలో 126 మంది టీచర్ల సర్దుబాటు
  •     ఇటు టీచర్లు.. అటు వీవీలు లేక వెనుకబడుతున్న చదువులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత వేధిస్తోంది. దీంతో విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. దీంతో స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య ఆధారంగా విద్యాశాఖ అధికారులు టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1432 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 3028 మంది టీచర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం 2482 మంది మాత్రమే ఉన్నారు. 577 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

నష్టపోతున్న పేద విద్యార్థులు

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో చదువుల్లో పేద పిల్లలు వెనుకబడిపోతున్నారు. స్కూళ్లలో గతేడాది నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టగా.. నైపుణ్యం గల టీచర్లు లేకపోవడం, ఉన్న వారికి శిక్షణ ఇవ్వకపోవడంతో బోధన అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో కనీసం 350 వరకు పోస్టులు భర్తీ చేసినా సరిపోతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడం.. అటు కనీసం వీవీలను నియమించకపోవడంతో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. టీచర్ల కొరత కారణంగా గతేడాది 132 మందిని అధికారులు ఆయా స్కూళ్లలో సర్దుబాటు చేశారు.

ఈ ఏడాది సైతం ఈ ప్రక్రియ చేపట్టి126 మందిని సర్దుబాటు చేశారు. అయితే, పొలిటికల్ ప్రెజర్స్​తో పాటు యూనియన్ నాయకుల ఒత్తిళ్లు సర్దుబాటుపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై కోర్టు తీర్పు వెలువడితే కథ మళ్లీ మొదటికొస్తుంది. ఇప్పటికే స్కూళ్లు మొదలై నెలన్నర గడుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సిలబస్ పై ప్రభావం పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

వీవీలు ముఖ్యమే..

గతంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో విద్యావాలంటీర్లతో బోధన చేయించేవారు. కానీ కరోనా తర్వాత 2021 నుంచి వీవీలను కొనసాగించడం లేదు. రెన్యువల్ చేయకపోవడంతో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయారు. జిల్లాలో హైస్కూల్‍, ప్రైమరీ స్కూళ్లలో కరోనాకు ముందు 500 మంది విద్యావాలంటీర్లు పనిచేసేవారు. ఒక్కో వీవీకి రూ.12 వేల వేతనంతో ప్రతి ఏడాది రెన్యువల్ చేశారు. కానీ కరోనా తర్వాత వారిని పట్టించుకోలేదు. తమను రెన్యువల్​చేయాలంటూ వారు మూడేండ్లుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం
 పట్టించుకోవడం లేదు. 

వెంటనే రెన్యువల్​ చేయాలి

గతంలో ఏటా మమ్మల్ని రెన్యువల్‍ చేసిన ప్రభుత్వం కరోనా కారణంగా రెన్యువల్ చేయడాన్ని నిలిపేసింది. వీవీలుగా మేము ఏండ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్నాం. జీతం తక్కువే అయినప్పటికీ విధులు నిర్వహించాం. రెన్యువల్ చేయకపోవడంతో ఉపాధి కోల్పోయాం. ప్రభుత్వం మా పట్ల శ్రద్ధ చూపి మళ్లీ రెన్యువల్ చేయాలి.

-   రాంకిషన్, వీవీల సంఘం అధ్యక్షుడు 

500 మంది టీచర్ల అవసరం ఉంది

ఆదిలాబాద్​జిల్లాలో ప్రస్తుతం 500 మంది టీచర్ల కొరత ఉంది. ప్రస్తుతం కొరత ఉన్న స్కూళ్లలో కొంత మంది టీచర్లను సర్దుబాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు 126 మందిని సర్దుబాటు చేశాం.

-  ప్రణీత, డీఈఓ ఆదిలాబాద్