బీటెక్ మోజు తగ్గింది: నాలుగేళ్లలో 11% పడిపోయిన స్టూడెంట్లు

బీటెక్ మోజు తగ్గింది: నాలుగేళ్లలో 11% పడిపోయిన స్టూడెంట్లు

ఎంటెక్ లో సగానికి సగం తగ్గుదల
ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఈడీకి డిమాండ్
నాలుగేళ్లలో 80% పెరిగిన బీఈడీ ప్రవేశాలు
అబ్బాయిలకు పోటీనిస్తున్న అమ్మాయిలు
హెచ్ఆర్డీ ఏఐఎస్ హెచ్ ఈ సర్వేలో వెల్లడి

….ఇప్పుడు ట్రెండ్​ మారింది. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇంజనీరింగ్​కు ఆదరణ తగ్గిపోతోంది. అవును, ఇది నిజం. ఒకప్పుడు బీటెక్​, ఎంటెక్​కు ఉన్న డిమాండ్​, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. డాక్టర్​, టీచర్​కు గిరాకీ పెరిగింది. కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్​ఆర్​డీ) చేసిన ఆలిండియా సర్వే ఆన్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ (ఏఐఎస్​హెచ్​ఈ)లో తేలిన విషయమిది. శనివారం హెచ్​ఆర్​డీ ఆ రిపోర్టును విడుదల చేసింది. మొత్తంగా ప్రొఫెషనల్​ కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య నాలుగేళ్లలో బాగా తగ్గిపోయింది. ఈ నాలుగేళ్లలో ప్రొఫెషనల్​ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 7 లక్షల 21 వేల 506 తగ్గింది. అంటే మొత్తం ప్రొఫెషనల్​ కోర్సు ఎన్​రోల్​మెంట్లలో 9 శాతం కోత పడింది. పీజీ స్థాయిలో తీసుకుంటే అది మరింత ఎక్కువగా ఉంది. డిమాండ్​ దాదాపు 32 శాతం తగ్గింది.

2015–16లో ప్రొఫెషనల్​ పీజీ కోర్సుల్లో 18 లక్షల 7 వేల 646 మంది జాయిన్​ అయితే, ఈ ఏడాది అది 12 లక్షల 36 వేల 404కు తగ్గింది. ఎంటెక్​ గురించి చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లలో దాదాపు సగానికి సగం డిమాండ్​ పడిపోయింది. 2014–15లో 2 లక్షల 89 వేల 311 మంది ఎంటెక్​లో చేరితే, ఈ ఏడాది లక్షా 35 వేల 500కు పడిపోయింది. బీటెక్​ డిమాండ్​ 11 శాతం తగ్గింది. అదే కాలానికి 42 లక్షల 54 వేల 919 మంది బీటెక్​లో చేరితే ఈ ఏడాది అది 37 లక్షల 70 వేల 949కి పడిపోయింది. అదే టైంలో ఎంబీఏ, ఎంబీబీఎస్​, బీఈడీ, ఎల్​ఎల్​బీలకు డిమాండ్​ పెరుగుతోంది. 2014–15లో 4 లక్షల 9 వేల 432 మంది ఎంబీఏలో చేరితే, ఈ ఏడాది అది 4 లక్షల 62 వేల 853కి పెరిగింది. బీఈడీకి అయితే డిమాండ్​ 80 శాతం పెరిగింది. 2014–15లో 6 లక్షల 57 వేల 194 స్టూడెంట్లు ఉంటే, ఇప్పుడు 11 లక్షల 75 వేల 517 మంది ఉన్నారు.

పై చదువులకు పోతం

ప్రొఫెషనల్​ కోర్సులకు డిమాండ్​ తగ్గుతున్నా పై చదువులకు పోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 3.66 కోట్ల మంది ఉన్నత చదువులకు వెళితే, ఈ ఏడాది అది 3.74 కోట్లకు చేరింది. డిగ్రీ, పీజీ, పీహెచ్​డీ లెవెల్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​లో గ్రాస్​ ఎన్​రోల్​మెంట్​ రేషియో (జీఈఆర్​) గత ఏడాది 25.8 శాతం మాత్రమే ఉండగా, ఈ ఏడాది అది 26.3 శాతానికి పెరిగింది. అందులోనూ ఎక్కువగా 18 నుంచి 23 ఏళ్ల వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ప్రొఫెషనల్​ కోర్సుల్లో కన్నా మామూలు డిగ్రీల్లోనే ఎక్కువగా ప్రవేశాలు నమోదవుతున్నాయి. గత నాలుగేళ్లలో ఆ సంఖ్య 16 లక్షలు పెరగడమే అందుకు ఉదాహరణ.

అమ్మాయిలు పెరుగుతున్నరు

ఒకప్పుడు పై చదువులంటేనే అమ్మాయిలకు దూరంగా ఉండేవి. కట్టుబాట్లు కావొచ్చు, వేరే కారణం కావొచ్చు, అమ్మాయిలకు చదువు రాత అంతగా ఉండేది కాదు. కానీ, కాలం మారుతున్నా కొద్దీ అది మారిపోయింది. ఇప్పుడు ఏ రంగాల్లో చూసినా అమ్మాయిలు ముందు వరుసలో ఉంటున్నారు. చదువుల్లో అబ్బాయిలకు పోటీనిస్తున్నారు. ఇప్పుడు హెచ్​ఆర్​డీ విడుదల చేసిన ఈ లెక్కలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 3.74 కోట్ల మంది స్టూడెంట్లుంటే, అందులో 1.82 కోట్ల మంది అమ్మాయిలే. మిగతా 1.92 కోట్ల మంది అబ్బాయిలు. తేడా జస్ట్​ కేవలం 12 లక్షలు. గత ఐదేళ్లలో జెండర్​ పారిటీ ఇండెక్స్​ (జీపీఐ) చాలా పెరిగిందని చెప్పేందుకు ఈ లెక్కలే నిదర్శనం.

పిల్లలూ.. పెద్దయ్యాక ఏమవుతారు? అడిగింది టీచర్​.

ఇంజనీర్​ అవుతా అన్నాడు బంటి. డాక్టర్​ అని చెప్పింది అమ్ము. నేను కలెక్టర్​ అన్నాడు బుజ్జిగాడు. క్లాసులోని ఏ ఒక్కరిని లేపినా నోటి నుంచి వచ్చినవి అవే. కానీ, వాళ్లను తయారు చేసే ‘టీచర్​’ అవుతా అని చెప్పింది చాలా తక్కువ మంది.

ఆర్ట్స్​కు డిమాండ్​ ఎక్కువ

మొత్తంగా ఆర్ట్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 93.49 లక్షల మంది స్టూడెంట్లతో టాప్లో ఉంది. అందులో 46.96 శాతం అబ్బాయిలు కాగా, 53.03 శాతం అమ్మాయిలున్నారు. ఆర్ట్స్లో అమ్మాయిలదే హవా. 47.13 లక్షల స్టూడెంట్లతో సైన్స్ గ్రూప్ రెండో స్థానంలో ఉంది. సైన్స్లోనూ అబ్బాయిలతో (49%) పోలిస్తే అమ్మాయిలే (51%) ఎక్కువగా ఉన్నారు. 40.3 లక్షలతో కామర్స్ మూడో ప్లేస్లో ఉంది. ఇందులో మాత్రం అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు. అబ్బాయిల వాటా 51.2 శాతం అయితే, అమ్మాయిలు 48.8 శాతం మంది ఉన్నారు. డిగ్రీలో ఎక్కువ మంది చేరుతున్నది బీఏలోనే. ఆ తర్వాత బీఎస్సీ, బీకాంలవైపు చూస్తున్నారు. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలను తీసుకుంటే కేవలం 2.5 శాతం కాలేజీల్లోనే పీహెచ్డీ అందుబాటులో ఉంది. ఎక్కువ మంది సైన్స్లోనే పీహెచ్డీ చేస్తున్నారు. ఈ ఏడాది లక్షా 69 వేల 170 మంది పీహెచ్డీలో చేరారు. గత ఏడాదితో పోలిస్తే అది 0.5 శాతం తక్కువ. 34.9 శాతం కాలేజీలు పీజీ కోర్సును అందిస్తున్నాయి. పీజీలో ఎక్కువ మంది సోషల్ సైన్స్, మేనేజ్మెంట్ స్ట్రీమ్లను ఎంచుకుంటున్నారు.