ఈడ్నే చదువుకుంటం
పక్క రాష్ట్రాలకు పోమంటున్న స్టూడెంట్లు
పోయినేడుతో పోలిస్తే సగానికి తగ్గిన సంఖ్య
హయ్యర్ ఎడ్యుకేషన్ పై కరోనా ఎఫెక్ట్ 02
హైదరాబాద్, వెలుగు: హయ్యర్ ఎడ్యుకేషన్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఇంటర్ తర్వాత ఉన్నత చదువుల కోసం పక్క రాష్ర్టాలకు వెళ్లే స్టూడెంట్స్సంఖ్య భారీగా తగ్గింది. పోయినేడాదితో పోలిస్తే, ఈసారి సగం మంది కూడా వెళ్లేందుకు సిద్ధంగా లేరని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అకడమిక్ ఇయర్ నష్టపోకుండా లోకల్ లోనే చదువుకునేందుకు స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ప్రతిఏటా ఇంటర్ పూర్తయ్యాక మన స్టూడెంట్లు ఇంజనీరింగ్, మెడిసిన్ సహా పలు కోర్సులు చదివేందుకు పక్క రాష్ర్టాలకు వెళ్తుంటారు. సీట్లు దొరక్క కొందరు, పక్క రాష్ర్టాల్లో స్టడీ బాగుంటుందని మరికొందరు పోతుంటారు. అలా వేరే రాష్ట్రానికి వెళ్లి చదువుకోవాలంటే స్టూడెంట్లకు మైగ్రేషన్సర్టిఫికెట్ అవసరమవుతుంది. వీటిని ఇంటర్ బోర్డు జారీ చేస్తుంది. ఈ సర్టిఫికెట్లను బట్టే ఎంత మంది స్టూడెంట్లు వేరే రాష్ర్టాలకు వెళ్తున్నారనేది లెక్కేస్తుంటారు. ఈ లెక్కల ప్రకారం 2019–20 అకడమిక్ ఇయర్ లో 13,796 మంది స్టూడెంట్లు మైగ్రేషన్ సర్టిఫికెట్లు పొందగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం 6,330 మంది మాత్రమే పొందారు. పోయినేడుతో పోలిస్తే, ఈ లెక్క సగానికి తగ్గడం గమనార్హం.
అందుకే పోతలేరు…
ఇంటర్ బోర్డు నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్లు పొందుతున్న వారి సంఖ్య గత నాలుగైదు ఏండ్లుగా ఏటా పెరుగుతోంది. 2015–16లో కేవలం 3,340 మంది మైగ్రేషన్ సర్టిఫికెట్ పొందగా.. 2016–17లో 10,414, 2017–18లో 10,123 మంది, 2018–19లో 12,138 మంది, 2019–20లో 17,796 మంది సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈసారి ఇప్పటివరకు 6,390 మంది స్టూడెంట్స్ మైగ్రేషన్ కోసం అప్లై చేసుకోగా 6,330 మందికి సర్టిఫికెట్ ఇచ్చారు. దేశంలో మార్చి నుంచే కరోనా తీవ్రత మొదలైంది. దీంతో అకడమిక్ ఇయర్ ఆలస్యంగా ప్రారంభమైంది. కాలేజీల్లో క్లాసులు ఎక్కడా పెద్దగా ప్రారంభం కాలేదు. అంతటా ఆన్ లైన్ చదువులే కొనసాగుతున్నాయి. దీంతో వివిధ రాష్ర్టాల్లోకి వెళ్లి చదువుకోవాలని భావించిన స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఆలోచన మారింది. అంతటా ఆన్లైన్ చదువులే కావడం, కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించకపోవడంతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇక్కడే చదువుకోవాలని భావిస్తున్నారు.
For More News..