భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సర్కారు కళాశాలల్లో ఇంటర్, ఎస్సెస్సీ చదువుతున్న విద్యార్థులు ప్రయోగాలు చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితి రెండేండ్లుగా కొనసాగుతుండగా కాలేజీల ప్రిన్సిపాల్స్, స్కూళ్ల హెచ్ఎంలుఉన్న నిధులతోనే మమ అనిపిస్తున్నారు.
ఒక్కో కాలేజీకి రూ.40 వేలు అవసరం
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 404 ప్రభుత్వ జూనియర్కాలేజీలున్నాయి. ప్రయోగాలకు సంబంధించి ఒక్కో కాలేజీకి ఏడాదికి దాదాపు రూ. 30వేల నుంచి రూ. 40వేలు, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఏడాదికి రూ.20వేలకు పైగానే ఫండ్స్ అవసరముంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి ఏడాదికి దాదాపు 40, బోటని, జువాలజీ విభాగాలకు సంబంధించి దాదాపు 24 ప్రయోగాలు చేయించాల్సి ఉంటుంది. ఫండ్స్లేకపోవడంతో కెమిస్ట్రీ విభాగంలో కావాల్సిన పరికరాలు కొనలేకపోతున్నారు. ఎక్స్‌పెయిరీ అయిన రసాయనాలనే వాడుతున్నారు. డిసెంబర్ఒకటో తేదీ నుంచి ప్రయోగాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా, ఎలా చేసేదని లెక్చరర్లు తలలు పట్టుకుంటున్నారు. కొందరు లెక్చరర్లు అయితే వారి జేబులోంచి డబ్బులు పెట్టుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 వరకు జూనియర్ కాలేజీలున్నాయి. ఇటీవల వచ్చిన గోదావరి వరదల్లో పలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లోని ల్యాబ్ఎక్విప్మెంట్ నీట మునిగి పాడైపోయింది. బూర్గంపహాడ్గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని ఫిజిక్స్ల్యాబ్..వరదల్లో మునిగిపోవడంతో పరికరాలన్నీ తడిసిపోయాయని, ప్రయోగాలు ఎట్లా చేయించాలో అర్థం కావడం లేదని లెక్చరర్లు అంటున్నారు.
ఎస్సెస్సీలో..
రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాలకు ల్యాబ్స్లేవు. ఉన్న స్కూళ్లలో వాటిని బీరువాల్లో సర్దేశారు. కొన్ని చోట్ల చోటు లేకపోవడంతో ఉన్న క్లాసురూముల్లోనే అడ్జస్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్టైంలో బయటకు తీసి ప్రయోగాలు చేయిస్తున్నారు. ఎన్సీఈఆర్టీ కింద ప్రాథమికోన్నత, రాష్ట్రీయ ఆవిష్కార్అభియాన్కింద ఉన్నత పాఠశాలలకు 2019–20 విద్యాసంవత్సరంలో సైన్స్, మ్యాథ్స్కిట్లను సరఫరా చేశారు. ప్రాథమికోన్నత గణితం కిట్‌కు రూ. 1661, సైన్స్కిట్కు రూ. 7639, ఉన్నత పాఠశాలల మ్యాథ్స్ కిట్‌కు రూ. 1907, సైన్స్కిట్కు రూ. 10,947 చొప్పున నిధులను ప్రభుత్వం కేటాయించేది. అయితే రెండేండ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో ఉన్న వాటితోనే టీచర్లు నెట్టుకొస్తున్నారు.
రెండేండ్లుగా నిధులు లేవు
గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రయోగాలకు సంబంధించి రెండేండ్లుగా ఎటువంటి నిధులు రావడం లేదు. ప్రయోగాలకు సంబంధించి కెమికల్స్ లేవు. ఉన్న వాటితోనే ప్రయోగాలు చేయిస్తున్నాం. గోదావరి వరదల్లో మా కాలేజీలోని ల్యాబ్‌లో పరికరాలన్నీ పాడయ్యాయి.
- గుగులోత్ చినియా, సర్కారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, బూర్గంపహడ్
పూర్తి స్థాయిలో చేయించలేకపోతున్నం
సైన్స్ ప్రయోగాలకు సంబంధించి ప్రభుత్వం రెండేండ్లుగా ఫండ్స్ఇవ్వడం లేదు. దీంతో ప్రయోగాలు పూర్తి స్థాయిలో చేయించలేని పరిస్థితి నెలకొంది. మేమే చేతిలోంచి పెట్టుకొని కొంత వరకు ప్రయోగాలు చేయిస్తున్నాం.
- సయ్యద్ యూసుఫ్, ప్రిన్సిపాల్, మణుగూరు జూనియర్ కాలేజ్