జూనియర్​ కాలేజీల్లో క్లాసులు జరగట్లే.. జిల్లాలో 50 శాతం లెక్చరర్​ పోస్టులు ఖాళీ

జూనియర్​ కాలేజీల్లో క్లాసులు జరగట్లే..  జిల్లాలో 50 శాతం లెక్చరర్​ పోస్టులు ఖాళీ

నాగర్​ కర్నూల్, వెలుగు: జిల్లాలోని జూనియర్​ కాలేజీల్లో లెక్చరర్ల కొరతతో క్లాసులు జరగకపోవడంతో స్టూడెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు తెరిచి నెల దాటినా గెస్ట్​ లెక్చరర్లను సర్కారు రెన్యువల్​ చేయలేదు. వారికి గత ఏడాదికి సంబంధించిన 6 నెలల జీతం ఇవ్వలేదు. దీంతో వారిని రెన్యువల్​ చేస్తారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ప్రతి రోజు కాలేజీకి వస్తున్న స్టూడెంట్స్​ క్లాసులు జరగకపోవడంతో టైం పాస్​ చేసి ఇండ్లకు తిరిగి వెళ్తున్నారు. ఇప్పటికే కాలేజీల్లో సైన్స్​​ల్యాబ్స్, ప్రాక్టికల్స్, లైబ్రరీలను మరిచిపోయే స్థితికి తెచ్చారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులు తీసుకున్న స్టూడెంట్స్​ లెక్చరర్లు లేక, సిలబస్​ జరగక టెన్షన్​కు గురవుతున్నారు. 

సగం పోస్టులు ఖాళీ..

జిల్లాలో 20 మండలాలుండగా, 15 మండల కేంద్రాల్లో గవర్నమెంట్​ జూనియర్​​కాలేజీలున్నాయి. పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, ఉప్పునుంతల, పెంట్లవెల్లి, చారకొండ మండలాల్లో కాలేజీలు లేకపోవడంతో పక్క మండలాలకు వెళ్తున్నారు. జూనియర్​ కాలేజీలో ప్రిన్సిపాల్​తో కలుపుకొని కనీసం 12 మంది లెక్చరర్లు ఉండాలి. అయితే ఏ కాలేజీలోనూ 8 మందికి మించి లెక్చరర్లు లేరు. కొన్ని కాలేజీలు నలుగురైదుగురితోనే నడుస్తున్నాయి. జిల్లాలోని జూనియర్​ కాలేజీలకు 196  లెక్చరర్​ పోస్టులు మంజూరవగా, 95 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 97 మంది రెగ్యులర్​, నలుగురు కాంట్రాక్ట్​ లెక్చరర్లు పని చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 95 ఖాళీలు ఉండగా, 64 మంది గెస్ట్​ లెక్చరర్లను నియమించి, 31 ఖాళీలను అలాగే వదిలేసింది. అడ్మిషన్ల సమయంలో ఊరూరా తిరిగి స్టూడెంట్లను కాలేజీల్లో చేర్చించిన తమను సర్కారు ఎప్పుడు రెన్యువల్​ చేస్తుందోనని  గెస్ట్​ లెక్చరర్లు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం గెస్ట్​ లెక్చరర్లను రెన్యువల్​ చేస్తే సిలబస్​ స్టార్ట్​ అవుతుందని స్టూడెంట్స్​ ఎదురు చూస్తున్నారు. వెంటనే లెక్చరర్లను నియమించి క్లాసులు ప్రారంభించాలని స్టూడెంట్స్​ కోరుతున్నారు.

నిలిచిన ప్రమోషన్లు, పోస్టింగ్​లు..

సమైక్య రాష్ట్రంలో స్కూల్​ అసిస్టెంట్లకు జేఎల్​గా ప్రమోషన్​ ఇచ్చేవారు. కాలేజ్​ సర్వీస్​ కమిషన్​ ద్వారా జేఎల్​ పోస్టులు భర్తీ చేసేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రమోషన్లు, రిక్రూట్​మెంట్లు నిలిచిపోయాయి. దీంతో కాలేజీలను కాంట్రాక్ట్, గెస్ట్​ లెకర్చర్లతో నడిపిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 1,658 గెస్ట్​ లెక్చరర్లు పని చేశారు. ఇటీవల కాంట్రాక్ట్​ లెక్చరర్ల సర్వీస్​ను రెగ్యులరైజ్​ చేసిన ప్రభుత్వం, మిగిలిన పోస్టులను క్లియర్​ వేకెన్సీలుగా చూపిస్తోంది. 9 ఏండ్లుగా గెస్ట్​ లెక్చరర్లుగా పని చేస్తున్న వారిని ఆటో రెన్యువల్​ సిస్టంలో కొనసాగించకుండా, కాలేజీలు తెరిచిన రెండు నెలల తరువాత కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఉద్యోగాలకు, జీవితాలకు భద్రత లేదని రెండేళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముగ్గురు, మెదక్​లో ఒక గెస్ట్​ లెక్చరర్​ సూసైడ్​ చేసుకున్నారు.